పశుగ్రాసం కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఏ క్షణంలోనైనా కిడ్నీ పనితీరు పడిపోవచ్చని ఆయనకు చికిత్స చేస్తున్న డా. ఉమేష్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం లాలూ కిడ్నీ 25 శాతం మాత్రమే పనిచేస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని రిమ్స్ అధికారులకు తెలియజేసినట్లు స్పష్టం చేశారు.
"నేను ఇదివరకు చెప్పిన విధంగానే లాలూ యాదవ్ కిడ్నీ 25 శాతం మాత్రమే పనిచేస్తోందన్నది వాస్తవం. ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఏ క్షణంలోనైనా ఆయన కిడ్నీ పనితీరు క్షీణించవచ్చు. కానీ అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. ఆయనకు 20 ఏళ్లుగా డయాబెటిస్ ఉంది కాబట్టి ఆయన అవయవాలు దెబ్బతింటున్నాయి. ఏ క్షణంలోనైనా అత్యవసర పరిస్థితి తలెత్తుతుందని రిమ్స్ ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా సమాచారం అందించాం."