Somanath ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రోలో 'సోమ్‌నాథ్' శకం ఆరంభమైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కార్యదర్శిగా, స్పేస్ కమిషన్ ఛైర్మన్‌గా ఎస్. సోమ్‌నాథ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఇస్రో ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ బాధ్యతలు చేపట్టకముందు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరక్టర్‌గా సోమ్‌నాథ్ సేవలు అందించారు.
2018 జనవరి నుంచి ఇస్రో ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న శివన్ పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో సోమ్‌నాథ్ సారథ్య బాధ్యతలు అందుకున్నారు.
కొల్లంలో టీకేఎం కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన సోమనాథ్.. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం 1985లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో చేరారు. సోమనాథ్.. ఉపగ్రహ వాహక నౌకల డిజైనింగ్‌లో కీలక పాత్ర పోషించారు. 2010 నుంచి 2014 వరకు జీఎస్‌ఎల్వీ ఎంకే- 3 ప్రాజెక్టు డైరెక్టర్‌గా.. ఉపగ్రహాల అభివృద్ధికి సంబంధించి పలు హోదాల్లో పనిచేశారు.