Doubts on Chandrababu security : స్కిల్ కేసులో కుంభకోణం జరిగిందంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబును అరెస్టు చేసిన ప్రభుత్వం... ఇప్పుడు ఆయన భద్రతలను మాత్రం గాలికొదిలేసిందన్న విమర్శలు జోరందుకున్నాయి. ఇందుకు తాజా పరిణామాలు, బయటకొస్తున్న లోపలి దృశ్యాలు తెలుగుదేశం శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ చర్యలన్నీ పరిశీలిస్తే చంద్రబాబు భద్రతకు పెను ప్రమాదమే పొంచి ఉందని ఆపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
TDP Leaders Protest on CBN Security in Jail: 'జైలులో చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉంది'
చంద్రబాబు నాయుడిని ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట 16 నిమిషాలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ( Central Jail) కు తరలించారు. జైలు ప్రధాన గేటుకు 20 మీటర్ల దూరంలోనే మీడియాను లోనికి అనుమతి లేందంటూ ఆపివేశారు. అక్కడితో మీడియా ఆగిపోయింది. గేటు బయటి దృశ్యాలు మినహా మిగతా ఎవరికీ ఈ దృశ్యాలు లభ్యం కాలేదు. కొన్ని వాట్సాప్ గ్రూపులు సాక్షి సంస్థకు చెందిన వ్యక్తులు, వైసీపీ సానుభూతిపరుల వద్ద చంద్రబాబు జైలులో అడుగుపెడుతున్న దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఇదెలా సాధ్యం..? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు.
జైలులో రెండో గేటులోకి రిమాండ్ ఖైదీ ( Remand prisoner) లు మినహా ఇతరులు ఎవర్నీ అనుమతించరు. వ్యక్తిగత సెల్‌ఫోన్లు, మీడియా కెమెరాలతో చిత్రీకరించడం నిషిద్ధం. రెండో గేటు వద్ద లోనికి వెళ్లేందుకు చంద్రబాబు నిరీక్షిస్తున్న దృశ్యాలు బయటకు పొక్కాయి. అంతేకాకుండా బాబు జైల్లోకి వెళ్లేందుకు కొన్ని గంటల ముందే... ఆయనకు కేటాయించే నంబర్ 7691 సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చింది. సీఐడీ ( CID) కార్యాలయంలో విచారణ పేరిట చంద్రబాబును ఉంచిన సమయంలో సాక్షి ఫొటోగ్రాఫర్, కెమెరామన్‌ను అనుమతించినట్లే... జైలులోకి కూడా అనుమతించారా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్వామిభక్తితో ఉన్న పోలీసులు, జైలు సిబ్బంది ఈ దృశ్యాలు చిత్రీకరించారా...? అన్న చర్చ జరుగుతుంది.