పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించాలంటూ జరగుతున్న నిరసనల్లో పాల్గొనకూడదని ప్రభుత్వ ఉద్యోగులకు సూచించింది కేంద్రం. ఈ సూచనను అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టాలని జాయింట్ ఫోరమ్ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఆధ్వర్యంలోని నేషనల్ జాయింట్ కౌన్సిల్ పిలుపునిచ్చింది. ఈ తరుణంలోనే ఆ ర్యాలీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదని చెప్పింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగులు ర్యాలీల్లో పాల్గొనకుండా నిషేధించాలని.. సాధారణ సెలవులు కూడా మంజూరు చేయవద్దని సంబంధిత అధికారులకు డీఓపీటీ సూచించింది. వీటిని అతిక్రమిస్తే సీసీఎస్ 1964 నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. నిరసన చేపట్టిన ఉద్యోగులకు వేతనాల కోతతో పాటు క్రమశిక్షల చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిబంధనలు అతిక్రమించి ఏ ఉద్యోగైనా.. నిరసనలో పాల్గొంటే సాయంత్రంలోగా డీఓపీటీకి తేలియజేయాలని చెప్పింది. దీని కోసం జాయింట్ సెక్రటరీ(పరిపాలన).. భద్రతా సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించింది.
"సమ్మెకు వెళ్లేందుకు ఉద్యోగులకు అధికారమిచ్చే చట్టబద్ధమైన నిబంధన ఏదీ లేదు. సమ్మెకు దిగడం ప్రవర్తనా నియమాల ప్రకారం తప్పిదమని.. ప్రభుత్వ ఉద్యోగులు చట్టాలకు లోబడే పనిచేయాలని సుప్రీం కోర్టు అనేక తీర్పుల్లో వెల్లడించింది."
--డీఓపీటీ ఉత్తర్వుల ప్రకారం