సమాచారం ఇచ్చేందుకు నిరాకరించడమే కాదు... ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు గల కారణాలను కూడా వివరించాలని సీబీఐకి సూచించింది కేంద్ర సమాచార కమిషన్. సీబీఐ దర్యాప్తు వివరాలు కోరుతూ.. ఓ వ్యక్తి వేసిన దరఖాస్తుపై ఈ విధంగా స్పందించింది. సమాచారం ఇవ్వడంలో దర్యాప్తు సంస్థకు ఎదురయ్యే సమస్యలేంటో స్పష్టంగా వివరించాకే దరఖాస్తును నిరాకరించాలని పేర్కొంది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)(హెచ్) ఆధారంగా ఇప్పటికే పలు దరఖాస్తులను నిరాకరించింది సీబీఐ.
చెన్నై సంస్థ గురించి అడిగినందుకే!
చెన్నైలోని ఓ చిన్న, మధ్య తరహా పరిశ్రమపై సీబీఐ చేస్తోన్న దర్యాప్తు వివరాలు కావాలని ఓ పౌరుడు సమాచర హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు సీబీఐ నిరాకరించింది. దీంతో, దరఖాస్తుదారుడు కేంద్ర సమాచార కమిషన్ను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో... దరఖాస్తుదారుడి వాదనలు విన్నారు సమాచార కమిషనర్ వనజ ఎన్ సర్నా.
" ఈ కేసుపై కేంద్ర పౌర సమాచార అధికారి దరఖాస్తు దారుడికి పూర్తి వివరణ ఇవ్వాలి. సమాచారం ఇవ్వకుండా సీబీఐ ఎందుకు నిరాకరించిందో స్పష్టత ఇవ్వాలి".
-వనజ ఎన్ సర్నా, సమాచార కమిషనర్.