పంజాబ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్ర ఇంఛార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్.. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో భేటీ అయిన తర్వాత సంక్షోభానికి తెరపడినట్లు కనిపించింది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ నియామకం దాదాపుగా ఖరారైందని అనుకున్న తరుణంలో మళ్లీ ముసలం మొదలైంది. 10 మంది శాసనసభ్యులు కెప్టెన్‌కు మద్దతుగా ఉమ్మడి ప్రకటన చేశారు. పార్టీ ఎమ్మెల్యేలతో పీపీసీసీ అధ్యక్షుడు సమావేశమయ్యేందుకు ఒకరోజు ముందు.. ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎమ్మెల్యేల ఉమ్మడి ప్రకటన..
పంజాబ్ కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణపై అధిష్ఠానం తుది ప్రకటన చేయనున్న నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు సీఎంకు మద్దతుగా ఆదివారం ఉమ్మడి ప్రకటన చేశారు. ఆయనను నిరాశపరచొద్దని అగ్రనాయకత్వాన్ని కోరారు. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇటీవలే పార్టీలో చేరిన ఆప్ ఎమ్మెల్యేల తరఫున పార్టీ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరా ఈ ప్రకటన విడుదల చేశారు.
" నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఒక సెలబ్రిటీ, పార్టీకి బలమని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, సొంత ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేయటం.. కార్యకర్తల్లో చీలికకు, పార్టీ బలహీన పడటానికి కారణమవుతోంది. అమరీందర్ సింగ్‌ను నిరాశపరచొద్దు. ఆయన నిరంతర కృషి వల్లే పంజాబ్‌లో పార్టీ బలంగా ఉంది. పీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక అనేది హైకమాండ్‌కు ఉన్న ప్రత్యేక హక్కు అనటంలో సందేహం లేదు. కానీ అదే సమయంలో గత కొద్ది నెలలుగా పార్టీ గ్రాఫ్‌ను తగ్గించిన మకిలిన తొలగించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని వివిధ వర్గాల్లో సింగ్‌కు అద్భుతమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా రైతుల్లో. సిక్కుల్లో సింగ్ అతిపెద్ద నేత. ఎన్నికలకు కేవలం ఆరునెలల సమయం ఉంది. పార్టీని వేరు వేరు దిశల్లోకి లాగటం అంత మంచిది కాదు. "
- ఎమ్మెల్యేల ఉమ్మడి ప్రకటన
సిద్ధూ వివాదాస్పద ట్వీట్లపై బహిరంగంగా క్షమాపణ కోరేవరకు ఆయన్ను కలవరాదన్న అమరీందర్ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు ఎమ్మెల్యేలు. సిద్ధూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడే పార్టీ, ప్రభుత్వం ఏకతాటిపై నడుస్తాయన్నారు.