చీకటి పడ్డాక మహిళలు పోలీస్‌స్టేషన్లకు వెళ్లొద్దని, ఠాణాల వైపు వెళ్లాలంటే కుటుంబంలోని పురుషుల తోడు తీసుకోవడం ఉత్తమమని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మౌర్య (Baby Rani Maurya BJP) హితవు పలికారు. వారణాసిలోని బజర్‌డీహా ప్రాంత వాల్మీకి బస్తీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో (Controversial Statements by BJP leaders) మహిళలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.
"పోలీస్‌స్టేషన్లలో మహిళా అధికారులు కూడా ఉన్నారు. అయినా సాయంత్రం 5 దాటాక అటు వెళ్లాల్సి వస్తే జాగ్రత్త. మీ తండ్రినో, సోదరుడినో తీసుకెళ్లండి. లేదంటే మరుసటి రోజు ఉదయం వెళ్లండి" అని హెచ్చరించారు.
విపక్షాల విమర్శలు
బేబీరాణి వ్యాఖ్యల వీడియోను బీఎస్పీ ఎంపీ కుంవర్ దానిశ్ అలి ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. 'ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హయాంలో (UP news) పోలీస్‌స్టేషన్లు మహిళలకు ప్రమాదకరంగా మారాయన్న మాట' అని వ్యాఖ్య జోడించారు.
బేబీరాణి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అన్షు అవస్థి తీవ్రంగా స్పందించారు. భాజపా, ఆరెస్సెస్ ఆలోచనా విధానానికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని విమర్శించారు.
"సాయంత్రం 5 తర్వాత మహిళలు పోలీస్ స్టేషన్కు ఎందుకు వెళ్లకూడదు? యూపీలో ఏ విధమైన ఆటవిక పాలన నడుస్తుందనేది దీన్ని బట్టి తెలుస్తుంది. మహిళలు సాయంత్రం ఐదు తర్వాత పోలీస్ స్టేషన్కు కూడా వెళ్లలేరు. ఓ వైపు ప్రియాంక గాంధీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటే.. ప్రభుత్వం వారిని బలహీనంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. కానీ, యూపీలోని మహిళలకు.. రాణి లక్ష్మీ భాయి, కల్పనా చావ్లా, ఇందిరా గాంధీలకు ఉన్నంత శక్తి ఉంది."