అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఫిబ్రవరి 4 నాటికి.. బ్యాంకు వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా రూ.2,500 కోట్ల విరాళాలు వచ్చినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. ఈ మేరకు వివరాలు వెల్లడించిన ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్.. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 27 వరకు రామాలయ సమర్పణ నిధి కార్యక్రమం జరిగినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:'దేశీయ విరాళాలతోనే రామ మందిర నిర్మాణం'
4లక్షల గ్రామాల్లో.. 9లక్షల మంది
దేశంలోని 4 లక్షల గ్రామాల నుంచి విరాళాల సేకరణ జరిగిందని.. అందులో 9 లక్షల మంది కార్యకర్తలు పాల్గొన్నారని చెప్పారు. సేకరించిన నిధులను 38,125 మంది కార్యకర్తలు బ్యాంకుల్లో జమ చేసినట్లు రాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం.. వెబ్‌సైట్ ద్వారా నిధులను సమకూరుతోందని చెప్పారు.
అయితే.. విరాళాల సేకరణలో పారదర్శకత పాటించేలా.. దేశవ్యాప్తంగా 49 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) తెలిపింది. దిల్లీ వేదికగా ఇద్దరు సీఏల పర్యవేక్షణలో 23 మంది నిష్ణాతులైన కార్యకర్తలు మొత్తం విరాళాలపై పని చేస్తున్నారని వెల్లడించింది.