బిహార్లో.. లిక్కర్ స్మగ్లింగ్ కేసులో ఓ జర్మన్ షెపర్డ్ కుక్క 11 రోజులుగా పోలీసుల రిమాండ్లో ఉంది. ఆ రాష్ట్ర సరిహద్దుల్లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా పోలీసులు.. ఓ కారులో విదేశీ మద్యం సీసాలను తరలిస్తున్నట్లు గుర్తించి ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఆ కారులో జర్మన్ షెపర్డ్ కుక్క ఉండడం వల్ల దానిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే..
జులై 6న బక్సర్ జిల్లాలోని ఘాజీపుర్ సరిహద్దు వద్ద రామ్సురేశ్ యాదవ్, భునేశ్వర్ యాదవ్ అనే ఇద్దరు స్మగ్లర్లు విదేశీ మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తున్న సమయంలో బక్సర్ పోలీసులకు పట్టుబడ్డారు. అదే సమయంలో వారితో పాటు ఆ కారులో జర్మన్ షెపర్డ్ కుక్క కూడా ఉంది. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. కారుతో పాటు మద్యం బాటిళ్లను, కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కుక్కను కూడా స్టేషన్కు తీసుకెళ్లారు.
ముప్పతిప్పలు పెడుతున్న శునకం.. ఏం ఆలోచించి పోలీసులు కుక్కను అదుపులోకి తీసుకున్నారోగాని.. ఇప్పుడు మాత్రం ఆ శునకమే వారికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఈ జర్మన్ షెపర్డ్ కుక్క రోజువారీ ఖర్చులు చాలా ఎక్కువ. ప్రతిరోజు ఆహారాన్ని సంతృప్తిగా పెట్టాలి. లేకపోతే ఒకటే రచ్చరచ్చ. దీంతో ఏం చేయాలో తెలియక స్టేషన్ సిబ్బంది తలో కొంత డబ్బులు చందాలు వేసుకుని.. ఆహారం పెడుతున్నారు. రోజువారీ ఫుడ్లో కొంచెం తగ్గినా.. శునకం గట్టిగా మొరిగి అందరి నిద్రను పాడుచేస్తుంది. దీంతో ఆ కుక్క యజమాని కోసం ఎదురుచూస్తున్నారు పోలీసులు. వచ్చి శునకాన్ని తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. అప్పటి వరకు దానిని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే మరి. ప్రస్తుతం ఆ కుక్కను చూసేందుకు జనం ఎగబడుతున్నారు.