Dog temple in Uttar Pradesh : ఓ గుడిలో శునకం విగ్రహానికి గత వందేళ్లుగా పూజలు చేస్తున్నారు. అలానే హోలీ, దీపావళీ పండుగలకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శునకం విగ్రహాం పాదాలకు నల్ల దారం కట్టి ఏమైనా కోరుకుంటే అవి నెరవేరుతాయని ప్రజలు నమ్ముతున్నారు. అదే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బైరో దేవాలయం.
ఇదీ కథ
సుమారు 100 సంవత్సరాల క్రితం బులంద్‌శహర్‌లోని సికంద్రాబాద్లో బాబా లటూరియా అనే గురువు ఉండేవారు. ఆయన ఆ ప్రాంతంలోనే ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఉంటూనే తనతో పాటు ఒక పెంపుడు కుక్కను పెంచుకున్నారు. దానిని బైరో బాబాగా పిలిచేవారు. అయితే ఓ రోజు బాబా లటూరియా నిర్మించుకున్న గుడిలోనే సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బైరో కూడా ఈ సమాధిలోకి దూకింది. అక్కడ ఉన్న ప్రజలు బైరోను బయటకు తీశారు. కానీ కొద్ది సేపటికే అది మరణించింది. ఆ తర్వాత ఆ శునకానికి గుర్తుగా ఓ విగ్రహాన్ని నిర్మించి పూజిస్తున్నారు. అప్పటి నుంచి ప్రేమ విధేయత గుర్తుగా బాబా కంటే ముందే బైరో విగ్రహానికి పూజలు చేస్తున్నారు భక్తులు.
అలానే హోలీ, దీపావళి పండుగలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటామని స్థానికులు తెలిపారు. మంగళవారం, శనివారాల్లో బైరోను దర్శించుకునేందుకు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారని చెప్పారు. ఈ గుడికి ఉత్తర్‌ప్రదేశ్ నుంచే కాకుండా దిల్లీ, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని గ్రామ ప్రజలు అన్నారు.