Dog Temple in Tamil Nadu: పెంపుడు జంతువులపై కొందరు వీడదేయలేని మమకారాన్ని పెంచుకుంటారు. సొంత బిడ్డలకన్నా ఎక్కువగా వాటిని ప్రేమిస్తారు. ఎప్పుడూ వాటితోనే గడుపుతుంటారు. అవి దూరమైతే తట్టుకోలేరు. అలాంటి ఓ పెద్దాయన.. తన పెంపుడు శునకంపై ఉన్న ప్రేమతో గుడి కట్టించి పూజలు చేస్తున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని శివగంగ జిల్లాలో జరిగింది.
జిల్లాలోని మనమదురయ్కి చెందిన ముత్తు అనే 82 ఏళ్ల విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగికి శునకాలంటే ఎంతో ప్రేమ. 12 ఏళ్ల క్రితం ఓ శునకాన్ని తీసుకొచ్చి పెంచుకున్నారు. టామ్‌గా పిలుచుకునే ఆ కుక్క ఇంట్లో ఒకరిలా కలిసిపోయింది. టామ్‌ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండేవారు కాదు ముత్తు. ఎక్కువగా దానితోనే గడిపేవారు. 2021లో అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయింది టామ్. తనకు దూరమైన శునకం జ్ఞాపకాలను మరవలేకపోయిన ముత్తు విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. తన పొలంలోనే గుడి కట్టి పూజలు చేస్తున్నారు.
" 2010 నుంచి టామ్ నా దగ్గరే ఉంది. నా పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించాను. దురదృష్టవశాత్తు 2021లో అది మృతి చెందింది. ఆ తర్వాత దాని విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. గత మూడు తరాలుగా మా కుటుంబంలో ఏ ఒక్కరు శునకాలు లేకుండా లేరు. మా తాతలు, మా తండ్రి అంతా శునకాల ప్రేమికులే."