ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో మద్యం మత్తులో కొందరు దుండగులు దారుణంగా ప్రవర్తించారు. తమను చూసి కుక్క అరిచిందని ఉరివేసి హత్య చేశారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ జరిగింది..
రాయ్‌పుర్‌లోని అమ్లీదీహ్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మద్యం తాగి రోడ్ల మీద తిరుగుతున్నారు. అదే సమయంలో వారిని చూసి కుక్క గట్టిగా అరిచింది. దీంతో కోపం పెంచుకున్న వారు దారుణానికి ఒడిగట్టారు. కుక్క కాళ్లు, చేతులు కట్టేసి ఉరితీశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పీపుల్ ఫర్ యానిమల్ అనే సంస్ధ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కుక్కను హత్య చేసిన ప్రదేశాన్ని ఆ సంస్థ ప్రతినిధులు సందర్శించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా డిమాండ్ చేస్తామని చెప్పారు. అయితే ఇంతవరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
అయితే ఇటీవల కాలంలో చాలా చోట్ల ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ బరేలి జిల్లాలో మందుబాబులు రెచ్చిపోయి రెండు కుక్కపిల్లలను గాయపరిచారు. కుక్క చెవులను కత్తిరించి మందుతో కలిపి సేవించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అంతకుముందు కొందరు ఆకతాయిలు ఓ పెంపుడు కుక్కకు విషం కలిపిన మాంసం ముక్కలు పెట్టి హత్య చేశారు. అమ్మాయిలను వేధిస్తున్న ఆ యువకులు తమ ఇంటి సమీపానికి వచ్చినప్పుడు కుక్కలు అరుస్తున్నందుకే చంపేశారని యజమాని ఆరోపించారు.