Dog Blood Donation In Karnataka : ఓ శునకం మరో శునకానికి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడింది. లెప్టోస్పెరోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్న ఓ శునకానికి శస్త్రచికిత్స సమయంలో సహాయం చేసింది మరో శునకం. ఈ విచిత్రమైన సంఘటన కర్ణాటక హవేరి జిల్లాలోని అక్కి ఆలూరు గ్రామంలో జరిగింది. ఇదే గ్రామంలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి కావడం విశేషం.
హనగల్ జిల్లాలోని హుల్లత్తి గ్రామానికి చెందిన రాకీ(శునకం) లెప్టోస్పెరోసిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. దీంతో శునకం యజమాని.. రాకీని అక్కి ఆలూరులోని వెటర్నిటీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే రాకీకి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని, అందుకు రక్తం అవసరం అని డాక్టర్ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న హనగల్ తాలూకాలోని బొమ్మనహళ్లికి చెందిన రంజిత్.. తన పెంపుడు కుక్క సిరితో రక్తదానం చేయించాలనుకున్నాడు. సిరిని ఆస్పత్రికి తీసుకెళ్లి రక్తదానం చేయించి రాకీ ప్రాణాలను కాపాడారు.
ఇప్పటికే అక్కి ఆలూరు గ్రామం రక్తదానానికి ప్రసిద్ధి చెందింది. బ్లడ్ ఆర్మీ ఆర్గనైజేషన్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు అక్కి ఆలూరుకు చెందిన కానిస్టేబుల్ కరబసప్ప గొండి. ఈ సంస్థ నేత్రదానం, రక్తదానం, చర్మదానంపై అవగాహన కల్పిస్తోంది. బ్లడ్ ఆర్మీ చీఫ్ కరబసప్ప ఇప్పటి వరకు 100 సార్లు రక్తదానం చేశారు. దీంతో హవేరి జిల్లాలో తొలి సెంచరీ రక్తదాతగా కరబసప్ప గొండి నిలిచారు. బ్లడ్ ఆర్మీ ఇప్పుడు ఈ శునకానికి కూడా రక్తాన్ని సేకరించి ప్రత్యేకతను చాటుకుంది. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక రక్త దాతను మనం చూడవచ్చు.