హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్‌పై వెళ్తుండగా తనను కరిచిందని.. కుక్కను గన్‌తో కాల్చి చంపేశాడు ఓ వ్యక్తి. కుమారుడిని వెంటబెట్టుకుని ఆ కుక్కను వెతికి మరీ కాల్పులు జరిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తండ్రీకొడుకులను అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం..
జిల్లాలోని సలార్పుర్ గ్రామానికి చెందిన సతీశ్ అనే వ్యక్తి.. తన ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి వస్తున్నప్పుడు అతడిని ఓ కుక్క కరిచింది. ఆ తర్వాత అతడు.. బైక్‌పైనే తన ఇంటికి వెళ్లాడు. కాసేపటి తర్వాత సతీశ్.. తన కుమారుడిని తీసుకుని మళ్లీ కుక్క కరిచిన ప్రాంతానికి వచ్చాడు. తనను కరిచిన కుక్క కోసం అక్కడ అంతా వెతికాడు. చివరకు ఓ ఇంటి సమీపంలో ఆ శునకాన్ని గుర్తించాడు.
వెంటనే తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో ఒక్కసారిగా కాల్పులు జరిపాడు సతీశ్. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత తండ్రీకొడుకులు.. అక్కడి నుంచి బైక్‌పై వెళ్లిపోయారు. ఈ దృశ్యాలంతా.. స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రీకొడుకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సతీశ్‌తో పాటు అతడి కుమారుడిని అరెస్ట్ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.