Dog Bites Kid In Lift : పాఠశాలకు వెళ్లి వస్తున్న ఓ బాలుడిని అతడుండే సొసైటీకి చెందిన ఓ కుక్క కరిచింది. అయితే, బాలుడు బాధతో విలవిల్లాడుతున్నా.. ఎలాంటి జాలి, కరుణలేని ఆ శునకం యజమాని అలాగే చూస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ మహిళా యజమాని ప్రవర్తన పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఓ హౌజింగ్ సొసైటీలో నివసిస్తున్న బాలుడు సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తున్నాడు. పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌లోకి ఎక్కగా.. ఆ తర్వాత ఓ మహిళ తన పెంపుడు శునకంతో ఆ లిఫ్ట్‌లో ఎక్కింది. అయితే, లిఫ్ట్ ఎక్కిన కొద్దిసేపటికే ఆ బాలుడి కుక్క కరిచేసింది. ఫలితంగా అతడు కాలును పట్టుకొని బాధతో విలవిల్లాడుతూన్నా.. ఆ మహిళ మాత్రం తనకేమీ పట్టనట్లు నిర్దయగా వ్యవహరించింది. బాలుడిని అలాగే చూస్తూ ఉందే తప్ప ఏమాత్రం స్పందించలేదు. బయటకు వెళ్లే సమయంలోనూ ఆ శునకం మరోసారి దాడికి యత్నించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.