తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీఎంసీకి చేటు చేస్తున్న దీదీ వ్యాఖ్యలు! - West Bengal assembly elections TMC

టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ఉదాసీన వ్యాఖ్యలు ఆ పార్టీకి చేటు చేసేలా కనిపిస్తున్నాయి. 200 సీట్లు గెలిపించకపోతే.. భాజపా తమ ఎమ్మెల్యేలను వారివైపు తిప్పుకుంటుందన్న దీదీ మాటలు.. విపక్షాల ప్రచారానికి అదనపు బలమవుతున్నాయి. దీదీలో అభద్రతా భావం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

west bengal assembly elections news
దీదీ, బంగాల్ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు

By

Published : Apr 10, 2021, 6:14 PM IST

"టీఎంసీకి 200కు పైగా స్థానాలను కట్టబెట్టండి. లేదంటే నా పార్టీలోని ద్రోహులను లంచం ఇచ్చి వారివైపు తిప్పుకోవడానికి భాజపా ప్రయత్నిస్తుంది"... ఏప్రిల్ 7న కూచ్​బెహర్​లో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు బంగాల్​ రాజకీయంలో చర్చనీయాంశంగా మారాయి. 296 స్థానాలున్న బంగాల్ అసెంబ్లీలో భారీ విజయం దక్కకపోతే.. ప్రభుత్వం పూర్తి పదవీ కాలం పూర్తి చేసుకోదేమోనన్న విశ్లేషకుల అనుమానాలకు దీదీ వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి.

బంగాల్​లో ఎన్నికల ఫలితాలు తనకు సానుకూలంగా ఉంటాయని మమతా బెనర్జీ ప్రకటించడం కొత్తేం కాదు. దీదీ విశ్వాసం, ధీమా గురించి అక్కడి ప్రజలకు బాగా తెలుసు. అయితే, ముఖ్యమంత్రి ధైర్యానికి బీటలు వారుతున్నాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. విపక్షాలపై విరుచుకుపడే సమయంలో దీదీ చేస్తున్న ఉదాసీన వ్యాఖ్యలు ఇలా భావించేందుకు కారణమవుతున్నాయి.

టీఎంసీ మూలస్తంభాలైన సువేందు అధికారి, రాజీవ్ బెనర్జీ వంటి నేతలు భాజపా తీర్థం పుచ్చుకున్నప్పుడే దీదీ విశ్వాసం సన్నగిల్లింది. అత్యంత విశ్వాసపాత్రులే వెన్నుపోటు పొడవడం వల్ల.. పార్టీలోని ఇతర నేతలపై దీదీకి అనుమానాలు పెరిగాయి. అప్పటి నుంచి.. భాజపా తమ నేతలను అక్రమంగా కొనుగోలు చేస్తోందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు.

సొంత నేతలపై ప్రభావమెంత?

కూచ్​బెహర్​లో మమత చేసిన వ్యాఖ్యలు టీఎంసీ నేతలు, పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యంపై తప్పక ప్రభావం చూపే అవకాశం ఉంది. సొంత నేతలపై పార్టీ అధినేతే అనుమానాలు వ్యక్తం చేయడం టీఎంసీకి చేటు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తృణమూల్ అభ్యర్థులపై సాధారణ ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని చెబుతున్నారు.

విపక్షాలకు వజ్రాయుధం, కానీ..

ఎన్నికల విషయంలో బంగాల్​లో ఉన్నంత హడావుడి ఎక్కడా కనిపించడం లేదు. వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం కూడా ఇక్కడే ఎక్కువగా చూస్తున్నాం. ఇక దీదీ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. విపక్షాలకు వరంగా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్-వామపక్ష కూటమి దీదీ ప్రకటనను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకొని టీఎంసీపై విమర్శలు ఎక్కుపెడుతోంది. గెలిచిన తర్వాత టీఎంసీ ఎమ్మెల్యేలు భాజపాలోకి వెళ్తారని, టీఎంసీకి ఓటేస్తే భాజపాకు ఓటేసినట్టేనని ప్రచారం చేస్తోంది.

ఈ పరిణామాలు భాజపా కంటే ఎక్కువగా కాంగ్రెస్-వామపక్ష కూటమికే లాభం చేకూరుస్తాయని ఎన్నికల వ్యూహకర్తలు సైతం చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే.. వారికి రాజకీయంగా మేలు కలుగుతుందని అంటున్నారు. అయితే.. అనుకున్న స్థాయిలో వీరు ప్రచారం చేయడం లేదని భావిస్తున్నారు.

"దీదీ వ్యాఖ్యల వల్ల యూనైటెడ్ ఫ్రంట్​కు ఓ అవకాశం లభించినట్లైంది. టీఎంసీకి ఓటేస్తే.. భాజపాకు వేసినట్టే అని యునైటెడ్ ఫ్రంట్ కూటమి నాయకులు ప్రజలకు అర్థమయ్యేలా చెబితే బాగుంటుంది. వారికి ఇది రాజకీయంగా కలిసొచ్చేదే. దురదృష్టవశాత్తు అలాంటి ప్రయత్నాలేవీ జరగడం లేదు. ప్రచారం ఈ దిశగా సాగట్లేదు."

-విశ్వనాథ్ చక్రవర్తి, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్

దీదీ చేసిన ఈ వ్యాఖ్యలు విపక్షాలకు బలమైన ఆయుధంగా మారే అవకాశం ఉందని మరో రాజకీయ నిపుణుడు డా. అమల్ కుమార్ పేర్కొన్నారు.

మరోవైపు, దీదీ తరహాలోనే భాజపా నేతలు సైతం 200కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్నారు. కానీ వీరిలో ఒక్కరు కూడా పార్టీ మార్పుల విషయంపై ఆందోళనలు వ్యక్తం చేయలేదు. ఇక్కడే దీదీకి, భాజపాకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మమతా బెనర్జీలో అభద్రతా భావం ఉందని స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details