Doctors Saves Life Of Child On Plane : విమాన ప్రయాణంలో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయన ఓ రెండేళ్ల చిన్నారిని.. దిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం కాపాడింది. 45 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించి చిన్నారి ప్రాణాలను రక్షించింది. బెంగళూరు నుంచి దిల్లీకి బయలుదేరిన విస్తారా సంస్థకు చెందిన యూకే 814 విమానంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
గుండె సంబంధిత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం బెంగళూరు నుంచి దిల్లీకి తీసుకెళుతున్నారు. అయితే ఆ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఒక్కసారిగా చిన్నారి.. ఊపిరి తీసుకోవడం ఆపేసింది. అంతేకాకుండా పెదాలు, వేళ్లు కూడా నీలిరంగులోకి మారాయి. నాడి కొట్టుకోవడం నిలిచిపోయింది. వెంటనే అధికారులు.. విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పుర్‌కు మళ్లించారు.
ఏం చేయాలో తెలియక చిన్నారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ఇండియన్ సొసైటీ ఫర్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ (ISVIR) సదస్సుకు వెళ్లి అదే విమానంలో తిరిగి వస్తున్న దిల్లీ ఎయిమ్స్‌కు చెందిన వైద్య బృందం చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది. వెంటనే చిన్నారిని తాము కాపాడుతామని ముందుకు వచ్చింది. హుటాహుటిన అత్యవసర చికిత్స ప్రారంభించింది.