Ukraine refugee surgery: రష్యా భీకర దాడుల నేపథ్యంలో భారత్‌కు వలస వచ్చిన ఓ ఉక్రెయిన్ కుటుంబాన్ని ఆదుకున్నారు ఉత్తరాఖండ్ వైద్యులు. అపెండిక్స్ సమస్యతో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారికి ఉచితంగా శస్త్రచికిత్స చేశారు. రెడ్ క్రాస్, జిల్లా ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ బుధవారం జరిగింది. వైద్యుల ఉదారతపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్లు.
ఆసుపత్రిలో ఉక్రెయిన్ మహిళ సోఫీ బాంబు దాడులు, తుపాకుల మోత మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎందరో ఉక్రెయిన్లు వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. ఈ క్రమంలో సోఫీ జలీల్ అనే మహిళ కూడా ఆమె నలుగురు పిల్లలతో భారత్‌కు చేరుకుంది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సైంజ్ కుమాలతీ అనే ప్రాంతంలోని ఓ ఆశ్రమంలో తలదాచుకుంటున్న ఆమెకు.. అనుకోని రూపంలో సమస్య ఎదురైంది.
మంగళవారం రాత్రి ఆమె చిన్న కుమార్తె.. ఆరేళ్ల అభయకు తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. డాక్టర్ల కుటుంబానికి చెందిన సోఫీ.. చిన్నారి పరిస్థితిపై ఉక్రెయిన్‌లోని తన కుటుంబ సభ్యులను సంప్రదించింది. చిన్నారికి తక్షణం చికిత్స అవసరమని తగిన పరీక్షలు చేయించాలని సూచించారు. కానీ ఆమెకు పరీక్షలు చేయించేందుకు కూడా డబ్బు లేదు.. దీంతో ఆమె రెడ్ క్రాస్ వారిని సంప్రదించి వారి సాయంతో కుమార్తెకు పరీక్షలు చేయించింది. డాక్టర్లు బాలికకు ఆపరేషన్ చేయాలని స్పష్టం చేశారు.
సర్జరీ ఖర్చులు భరించే స్తోమత లేని సోఫీకు అండగా నిలిచారు రెడ్ క్రాస్ ఛారిటీ నిర్వహకులు. వారి విజ్ఞప్తి మేరకు వైద్యులు బాలికకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. వైద్యుల ఔదార్యం, రెడ్ క్రాస్ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపింది. వారికి ధన్యవాదాలు తెలిపింది.
ఇదీ చూడండి :పట్టపగలే నడిరోడ్డుపై ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య..