Doctors corona: వైద్యులపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. బిహార్‌లోని నలంద వైద్యకళాశాల ఆస్పత్రితో మరో 59మంది డాక్టర్లకు పాజిటివ్‌గా తేలింది. సోమవారం ఇదే హాస్పిటల్లో 72మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. దీంతో ఇక్కడ వైరస్ సోకిన వైద్యుల సంఖ్య 218కి చేరింది. జనవవరి 1-2మధ్య ఈ ఆస్పత్రిలో 87మంది వైద్యులు కరోనా బారినపడటం గమనార్హం. 2021 చివరి వారం పట్నాలో నిర్వహించిన 96వ వార్షిక వైద్య సదస్సు అనంతరం డాక్టర్లు వరుసగా కరోనా బారినపడుతున్నారు. భారత వైద్య సమాఖ్య(ఐఎంఏ) ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
- ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో వైద్యులు.. వైరస్ బాధితులుగా మారుతున్నారని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఇలానే జరిగిందని పేర్కొంది. అప్పుడు బిహార్‌లోనే అత్యధికంగా వైద్యుల మరణాలు నమోదయ్యాయని చెప్పింది.
- దేశ రాజధాని దిల్లీలోనూ వైద్యులు ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. ఎయిమ్స్‌లో కనీసం 50మంది డాక్టర్లకు వైరస్ నిర్ధరణ అయింది. గత కొద్ది రోజుల్లో దిల్లీ వ్యాప్తంగా మొత్తం 120మంది వైద్యులకు పాాజిటివ్గా తేలింది.
- బంగాల్లో కూడా ఎక్కువ సంఖ్యలో వైద్యులు కరోనా బారిన పడుతున్నారు. గతవారంలో కోల్‌కతాలోని వివిధ ఆస్పత్రుల్లో మొత్తం 200మంది డాక్టర్లు వైరస్ బారినపడ్డారు.
- అయితే వైద్యులు కరోనా బారినపడుతున్నారని రోగులు ఆందోళన చెందవద్దని నిపుణులు సూచించారు. డాక్టర్లను అత్యవసరం అయితేనే భౌతికంగా సంప్రదించాలని చెబుతున్నారు. చిన్న చిన్న సమస్యలకైతే ఫోన్ల ద్వారా సంప్రదిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
- వైద్యుల పరిస్థితి చూసి ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఐఎంఏ అధ్యక్షుడు డా.సహజానంద్ ఈటీవీ భారత్‌కు తెలిపారు. కరోనా బారినపడిన డాక్టర్లకు స్వల్ప లక్షణాలే ఉ్ననాయని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్లే కేసులు పెరుగుతున్నాయని, అయితే దాని తీవ్రత తక్కువగా ఉన్నట్లు చెప్పారు. వాక్సిన్ తీసుకున్నంత మాత్రాన కరోనా రాదని చెప్పలేమని, అయితే వ్యాధి తీవ్రతను తగ్గించి ప్రాణాపాయ ముప్పు నుంచి మాత్రం టీకా రక్షిస్తుందని స్పష్టం చేశారు.