తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో అంతకంతకూ విస్తరిస్తున్న జికా వైరస్​

కేరళలో జికా వైరస్​ కేసులు కొత్తగా మరో నాలుగు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23కు చేరింది. తాజాగా 16 ఏళ్ల అమ్మాయిలో వైరస్​ లక్షణాలను గుర్తించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్​ తెలిపారు.

zika virus, new zika cases in kerala
జికా వైరస్​, జికా వైరస్ కొత్త కేసులు

By

Published : Jul 14, 2021, 5:39 AM IST

Updated : Jul 14, 2021, 2:38 PM IST

కరోనాతో వణుకుతున్న కేరళలో జికా వైరస్‌ కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23కి చేరినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. తాజాగా తిరువనంతపురంకు చెందిన 16 ఏళ్ల అమ్మాయిలో వైరస్​ లక్షణాలు వెలుగు చూసినట్లు పేర్కొన్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన 38 ఏళ్ల వైద్యుడికి జికా సోకినట్టు కోయంబత్తూరు ల్యాబ్‌ నిర్ధారించినట్టు తెలిపారు. అలాగే, వైరస్‌ సోకినవారిలో 35 ఏళ్ల వ్యక్తితో పాటు 41 ఏళ్ల మహిళ కూడా ఉన్నట్టు వివరించారు.

వీరి శాంపిల్స్‌ను ప్రభుత్వ వైద్య కళాశాలలోని వైరాలజీ ల్యాబ్‌తో పాటు కోయంబత్తూరుకు చెందిన ఓ ల్యాబ్‌లో పరీక్షించినట్టు తెలిపారు. రాష్ట్రంలో జికా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో జికా వైరస్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమైనట్టు తెలిపారు.

జికా వైరస్‌ ఏడెస్‌ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ వైరస్‌ సోకితే కొందరిలో జ్వరం, దద్దర్లు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు సోకితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత 1947లో ఉగాండా అడవుల్లో కోతుల్లో ఈ వైరస్ కనిపించింది. 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో అహ్మదాబాద్‌, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి.

ఇదీ చూడండి:దేశంలోని తొలి కరోనా రోగికి మరోసారి పాజిటివ్

Last Updated : Jul 14, 2021, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details