కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే.. ఏకంగా మహిళ గర్భాశయాన్ని తొలగించాడు ఓ వైద్యుడు. పిత్తాశయంలో రాళ్లకు బదులుగా గర్భసంచిని తీసేశాడు. విషయం తెలిసి డాక్టర్‌ను గట్టిగా నిలదీస్తే.. చంపేస్తానని బాధితులను బెదిరించాడు. పోలీసులు కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోయారు. దీంతో కోర్టును ఆశ్రయించింది సదరు మహిళ. బాధితురాలి ఆభ్యర్తనను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. మూడేళ్ల తరువాత ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చోలాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేల గ్రామానికి చెందిన ఉషా మౌర్య.. 2020 మార్చిలో తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ స్థానిక ఆశ కార్యకర్తను సంప్రదించింది. మహిళ పరిస్థితిని గమనించిన ఆశ కార్యకర్త.. అదే ప్రాంతంలో ఉండే ఓం హాస్పిటల్ అండ్ సర్జికల్ సెంటర్లో పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చింది. దీంతో ఆ ఆసుపత్రిని నడిపించే డా. ప్రవీణ్‌ను సంప్రదించింది ఉష.
డాక్టర్ ప్రవీణ్ ఉషకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించాడు. చివరకు పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని అదే కడుపునొప్పికి కారణమని తెలిపాడు. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి.. ఆసుపత్రిలో చేరాలని ఉషకు సూచించాడు. 2020 మే 21న ఆమెకు ఆపరేషన్ చేశాడు. "డా. ప్రవీణ్.. పిత్తాశయంలో రాళ్లుఉన్నాయని నాకు ఆపరేషన్ నిర్వహించాడు. అయితే రాళ్లకు బదులుగా నా గర్భాశయాన్ని తొలగించాడు. ఆ విషయం అప్పుడు నాకు తెలీదు. అనంతరం మళ్లీ కడుపు నొప్పి వచ్చింది. దీంతో స్థానికంగా అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించుకోగా.. అసలు విషయం తెలిసింది" అని ఉషా మౌర్య తెలిపింది. దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే వారు స్పందించలేదని పేర్కొంది. డాక్టర్‌ను నిలదీస్తే బెదిరించాడని వెల్లడించింది. దీంతో చేసేదిలేక కోర్టును ఆశ్రయించినట్లు ఉష వివరించింది.
అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించుకోగా కిడ్నీలో రాళ్లు అలాగే ఉన్నాయని.. తన భార్య గర్భాశయం మాత్రం లేదన్నాడు ఉష భర్త గోవింద్. రాళ్ల పరిణామం కూడా పెరిగిందన్నాడు. దీంతో రెండేళ్ల క్రితం కోర్టును ఆశ్రయించినట్లు గోవింద్ పేర్కొన్నాడు. ఉషా, గోవింద్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ఘటన జరిగిన దాదాపు మూడేళ్ల తరువాత డాక్టర్ ప్రవీణ్‌పై, ఆశ కార్యకర్తపై కేసు నమోదు చేయాల్సిందిగా బుధవారం పోలీసులను ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన చోలాపుర్ పోలీసులు.. డాక్టర్ ప్రవీణ్‌తో పాటు ఆశ కార్యకర్తను ప్రశ్నిస్తామని తెలిపారు. నివేదిక అనంతరం వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పూర్తి దర్యాప్తు తరువాతే నిజనిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.