Doctor Gagandeep Kang on Booster dose: కరోనా వైరస్ మార్పులు చెందుతూ 'ఒమిక్రాన్' తరహా మహమ్మారిగా ఎదిగింది. దాంతో ప్రభుత్వం అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వైరాలజిస్ట్, వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్‌ను 'ఈటీవీ భారత్' పలు అంశాలపై సంప్రదించింది. ప్రయాణాలపై నిషేధం విధించడం కన్నా, పరీక్షలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. వృద్ధులు, ఇతరత్రా వ్యాధులు ఉన్నవారికి మూడో విడత కింద బూస్టర్ డోసు ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు.
ఒమిక్రాన్ తరహా వైరస్‌కు ప్రస్తుతం ఉన్న టీకాలు సరిపోతాయా?
కచ్చితంగా చెప్పలేం. ఫైజర్ టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో తటస్థ పరిచే యాంటీబాడీలు 40 రెట్లు తక్కువగా ఉన్నాయి. మిగిలిన టీకాలూ అదే విధంగా ఉండొచ్చు. అయితే ఇవి కేవలం ప్రయోగశాలల్లో జరిపిన ఫలితాలు మాత్రమే. ప్రజలపై చేసినవి కావు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజలపై చేసిన ప్రయోగాల ఫలితాలు త్వరలో వెల్లడవుతాయి.
దీని వ్యాప్తి ఎలా ఉంటుంది?
డెల్టా తరహా వైరస్‌కన్నా అధికంగానే ఉంటుంది. దీంట్లోని వ్యాప్తి, నిరోధక మార్గాలు కలగాపులగమయ్యాయి. అందువల్ల ఒకసారి వైరస్ సోకిన వారికి, టీకాలు వేయించుకున్నవారికి కూడా మళ్లీ వచ్చే ప్రమాదం ఉంది.