Doctor Commits Suicide: ఓ గర్భిణీకి చికిత్స చేస్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో.. గైనకాలజిస్ట్ డా. అర్చనపై ఐపీసీ సెక్షన్ 302 కింద లాల్సోట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తీవ్ర మనస్తాపం చెందిన డాక్టర్.. ఆత్మహత్య చేసుకున్నారు. రాజస్థాన్ దౌసా జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల సమాచారం ప్రకారం.. డా. అర్చనా శర్మ, ఆమె భర్త కలిసి లాల్సోట్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతున్నారు. అక్కడ సిజేరియన్ డెలివరీ చేస్తుండగా ఓ గర్భిణీ సోమవారం మృతిచెందింది. దీంతో వైద్యురాలి నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆమెపై చర్యకు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం.. ఆస్పత్రిపైనే ఉన్న తన నివాసంలో ఆ వైద్యురాలు మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. తాను నిర్దోషినని చెప్పడానికి చావే సాక్ష్యం అని, అమాయక డాక్టర్లను వేధించడం మానుకోవాలని అందులో చెప్పారు డాక్టర్ అర్చన.
ఈ ఘటన జిల్లావ్యాప్తంగా ఉన్న వైద్యులను ఆగ్రహావేశాలకు గురిచేసింది. దీనికి నిరసనగా.. బుధవారం వైద్య సేవలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యాధికారులు కూడా.. వీరికి మద్దతుగా నిలిచారు. వృత్తిపరమైన విధుల్లో ఉన్నప్పుడు వైద్యులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో ఉందని ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ సొసైటీ సెక్రటరీ డా. విజయ్ కపూర్ అన్నారు. ఈ ఘటనలో వైద్యురాలు సహా ఆమె కుటుంబసభ్యులు తీవ్రవేదనకు గురయ్యారని, అందుకే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. బాధ్యులైన పోలీసు అధికారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేవరకు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.