కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, స్టార్ హోటళ్లతో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్(vaccination) ప్యాకేజీ ప్రకటనలు జారీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లలో టీకా వేయడం జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్(vaccination) కార్యక్రమ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. అందువల్ల అలాంటిచోట వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించకూడదని పేర్కొంటూ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ రాష్ట్రాలకు లేఖ రాశారు. కేవలం నాలుగుచోట్ల మాత్రమే టీకాల కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. అందుకు అతీతంగా ఎక్కడా చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ వేయాల్సిన ప్రదేశాలు
- ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్
- ప్రైవేటు ఆస్పత్రి నిర్వహించే ప్రైవేటు కొవిడ్ టీకా సెంటర్
- ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు కంపెనీల పరిధిలో ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహించే వర్క్ ప్లేస్ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు
- వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు, పంచాయతీ భవనాలు, స్కూళ్లు, కాలేజీలు, వృద్ధాశ్రమాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన కేంద్రాలు