అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రం- మగ్గంపై నేస్తున్న లక్షలాది మంది భక్తులు Do Dhaage Ram Ke Liye Event In Pune Maharashtra :అయోధ్య రాముడి కోసం పవిత్రమైన వస్త్రాన్ని మహారాష్ట్రలోని పుణెలో వేలాది మంది భక్తులు తయారుచేస్తున్నారు. ఆ పవిత్ర వస్త్రాన్ని నేసే 'దో ధాగే శ్రీ రామ్ కే లియే' కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. 13 రోజులపాటు నిర్వహించే కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ్‌క్షేత్ర ట్రస్ట్, హెరిటేజ్ హ్యాండ్ వేరింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
వస్త్రం నేయడానికి బారులు తీరిన భక్తులు "ఇక్కడ ఉన్న వస్త్రంపై శ్రీ రామనామం రాస్తున్నారు. ఇక్కడ చాలా పవిత్రమైన వాతావరణం ఉంది. శ్రీరాముడికి ఓ వస్తువును అందిస్తున్నందుకు నేను సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాను. శ్రీరాముడికి సమర్పిస్తున్న వస్త్రంపై రెండు దారాలు నేస్తున్నాము. ఇది మా భక్తితో చేసిన నైవేద్యం"
-- సంగీత పర్వత్, భక్తురాలు
"రామజన్మభూమి కోసం చాలా పోరాటం జరిగింది. కానీ అంత దూరం వెళ్లలేని వారు చాలా మంది ఉన్నారు. అందుకే మేము భక్తులంతా రెండు దారాలతో నేసిన వస్త్రాన్ని శ్రీరాముడికి అందించబోతున్నాం. ఇది చేనేత కార్మికులకు దొరికిన గొప్ప అదృష్టం"
--యోగేశ్, చేనేత కళాకారుడు
ఈ కార్యక్రమం శ్రీరాముడి విగ్రహం కోసం పవిత్ర వస్త్రం నేయడమే కాకుండా సంప్రదాయ కళ అయిన చేనేతను ప్రోత్సహించడానికి కూడా ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
శ్రీరాముడికి వస్త్రం నేస్తున్న మహిళలు
"ఈ కార్యక్రమం ద్వారా చేనేత కార్మికులకు గౌరవం లభిస్తుంది. దానికి తగ్గట్టుగా వారికి డబ్బు వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నేను గత కొన్నేళ్లుగా ఈ పని చేస్తున్నాను. మేము 2019లో నరేంద్ర మోదీ కోసం ఇలాంటి ప్రచారాన్ని ప్రారంభించాం. నాలుగైదు రోజుల వ్యవధిలో 12వేల మంది వచ్చారు. రామమందిరం కట్టినప్పుడు రాముడికి వస్త్రం నేద్దామని అప్పుడే నిర్ణయించుకున్నాను"
--అనఘా ఘైసాస్, హెరిటేజ్ హ్యాండ్ వేర్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు
ఇప్పటివరకు 8 లక్షల మంది ఈ వేదికను సందర్శించి శ్రీరాముడి కోసం పవిత్ర వస్త్రం నేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు.
ఇది నిజంగా చాలా మంచి కార్యక్రమమని ధవల్ మెహతా అనే భక్తుడు తెలిపాడు. శ్రీరాముడికి వస్త్రాన్ని నేయడం ఆశీర్వాదంగా భావిస్తున్నానని, తాను కచ్చితంగా రామ్ లల్లా దర్శనం కోసం అయోధ్యకు వెళ్తానని తెలిపాడు.
ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించారు. ఇది అందరూ ఐకమత్యంగా కలిసి చేపట్టిన కార్యక్రమంగా అభివర్ణించారు. ఇక్కడ నేసిన వస్త్రాన్ని పట్టుతో రూపొందించామని తెలిపారు. అంతే కాకుండా వెండి జరీతో అలంకరించామని వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ద్వారా రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేయనున్నామని తెలిపారు.
బంగారు పూతతో అయోధ్య ఆలయం- వెండి నాణేలపై రామ దర్బార్- గిఫ్ట్స్ సూపర్!
అయోధ్య రామయ్యకు 5వేల డైమండ్స్‌తో నెక్లెస్- వజ్రాల వ్యాపారి అరుదైన కానుక!