Bombay high court on DNA test: అత్యాచార కేసుల్లో డీఎన్‌ఏ పరీక్ష ఫలితాన్ని తిరుగులేని సాక్ష్యంగా పరిగణించరాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇతర ఆధారాలను ధ్రువపరచుకోవడానికే దాన్ని ఉపయోగించుకోవాలని పేర్కొంది. 14 ఏళ్ల బాలిక అత్యాచారం కేసులో నిందితుడి బెయిలు పిటిషన్‌ను తిరస్కరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తన ఇంట్లో పనిచేసే ఈ బాలికపై పదిసార్లు అత్యాచారానికి పాల్పడ్డట్టు నిందితుడిపై అభియోగాలు మోపారు. బాధితురాలు గర్భం దాల్చడం వల్ల ఈ అకృత్యం వెలుగులోకి వచ్చింది. తనపై జరిగిన లైంగిక దాడిని వివరిస్తూ ఆమె వాంగ్మూలం ఇచ్చింది. నిందితుడిని 2020 సెప్టెంబరులో అరెస్టు చేశారు. అయితే డీఎన్‌ఏ పరీక్షలో 'నెగెటివ్' ఫలితం వచ్చింది. అయినా బాధితురాలి వాంగ్మూలాన్ని విస్మరించడానికి లేదని న్యాయమూర్తి జస్టిస్ భారతీ డాంగ్రే స్పష్టంచేశారు. డీఎన్‌ఏ పరీక్షలో 'పాజిటివ్' ఫలితం వస్తే.. నిందితుడికి వ్యతిరేకంగా అది తిరుగులేని సాక్ష్యమయ్యేదని పేర్కొన్నారు.