తమిళనాడు ఆలంగుడికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే పూంగోదై ఆలడి అరుణ.. అస్వస్థతతో నవంబర్ 19న తిరునెల్వేలిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే.. ఆసుపత్రిలో చేరికపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీలో అంతర్గత కలహాల వల్ల ఆమె ఆత్మహత్యాయత్నం చేశారన్న వార్తలు కలకలం సృష్టించాయి. దీనిపై స్పందించిన డీఎంకే.. అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేసింది.
కుటుంబ కలహాల వల్ల ఆమె నిద్ర మాత్రలు మింగినట్లు మరో వాదన వినిపిస్తోంది.
ఇదీ జరిగింది..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నవంబర్ 18న తెన్కాశి జిల్లా కడియంలో జరిగిన డీఎంకే సమావేశానికి అరుణ హాజరయ్యారు. అక్కడ కొందరు కార్యకర్తలు.. ఆమెతో వాగ్వాదానికి దిగినట్లు చెబుతున్నారు. జిల్లా డీఎంకే శాఖ కార్యదర్శి శివ పద్మనాభన్ ప్రోద్బలంతో.. ఆమె మాట్లాడుతుంటే కొందరు మైక్ లాక్కున్నారని, దీంతో విరక్తి చెందిన అరుణ నిద్ర మాత్రలు మింగినట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
అయితే.. ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అరుణ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం ఆమెను చెన్నై తరలించనున్నారు.