తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ఆయా పార్టీల భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపిణీ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేలు రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాతో కలిసి పోటీ చేయనున్నాయి. మంగళవారం సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి. కానీ స్పష్టత రాలేదు. మార్చి 7న భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఈ పర్యటనకు ముందే అన్నాడీఎంకేతో సీట్ల పంపకం తేలాల్సి ఉండగా మరింత ఆలస్యం అయినట్లు రాష్ట్ర భాజపా సీనియర్ నాయకులు తెలిపారు.
ఇప్పటికే సీట్ల పంపకంలో భాగంగా మిత్రపక్షమైన పీఎంకే(పట్టాలి మక్కల్ కట్చి పార్టీ)కి 23 సీట్లు కేటాయించినట్లు అధికార అన్నాడీఎంకే భాజపాకు తెలిపింది. విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో చర్చలు కొనసాగుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీనియర్ నాయకులైన ఆర్.వైతిలింగం, కేపీ మునుస్వామి డీఎండీకే నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం.