తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ అక్కడి పొత్తులపై పూర్తి స్పష్టత రావడం లేదు. ముఖ్యంగా విజయకాంత్ నేతృత్వంలోని దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగం(డీఎండీకే) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర సీఎం, అన్నాడీఎంకే అగ్రనేత ఎడప్పాడి పళనిస్వామి డిసెంబర్లోనే ప్రచార పర్వానికి శంఖారావం పూరించినా... డీఎండీకేతో పొత్తు విషయం ఇప్పటికీ చర్చకు రాలేదు. కానీ, ఇతర పార్టీల విషయంలో పళనిస్వామి చురుగ్గానే అడుగులు వేస్తున్నారు. కూటమి భాగస్వామి అయిన పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) వ్యవస్థాపకుడు డా. ఎస్ రాందాస్‌ను కలిసేందుకు మంత్రులను పురమాయిస్తున్నారు. పీఎంకే గిల్లిగజ్జాలకు దిగుతున్నా.. ఆ పార్టీని తమతో కలుపుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ పార్టీతో కలిసే పోటీ చేసింది అన్నాడీఎంకే. అప్పుడు పీఎంకే అధినేత రాందాస్ ఓటమి చవిచూశారు. అయినా.. విశ్వాసం కోల్పోకుండా అతడిని రాజ్యసభకు పంపించింది అన్నాడీఎంకే.
విమర్శించినా.. వారి కోసమే!
సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులను బహిరంగంగా విమర్శిస్తున్నారు పీఎంకే యువజన విభాగం నేతలు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యలో 'వన్నియార్ల'కు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో హింసాత్మక ఘటనలకు సైతం పాల్పడ్డారు. వందలూర్, తాంబరం మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ రైలుపై రాళ్లు విసిరారు. చెన్నై-బెంగళూరు రహదారిని దిగ్బంధించారు. అయితే వీటన్నింటినీ తేలికగానే తీసుకుంటోంది అన్నాడీఎంకే. ఇప్పటికీ ఆ పార్టీని తమతో కలుపుకోవాలనే భావిస్తోంది. హింసకు పాల్పడ్డ కార్యకర్తలపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇదీ చదవండి:చిన్నమ్మ దారెటు? పార్టీపై పెత్తనం సాధ్యమా?
మరోవైపు, అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకోవాలని కోరుకుంటున్న డీఎండీకేకు మాత్రం ఎదురుచూపులే శరణ్యం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ.. చర్చల విషయం మాత్రం ఇప్పటికీ ప్రస్తావనకు రావడం లేదు. అన్నాడీఎంకే నేతలు డీఎండీకేను పట్టించుకోకుండా ప్రచారపర్వంలో మునిగితేలుతున్నారు.
కూటములు మార్చి మార్చి..
2005లో ఈ పార్టీని స్థాపించారు విజయకాంత్. 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించారు. అయితే వృద్ధాచలం అసెంబ్లీ నియోజకవర్గం మినహా అన్నింట్లోనూ అభ్యర్థులు ఓడిపోయారు. గెలిచిన ఒక్క సీటూ విజయకాంత్‌దే. అయితే రాష్ట్రవ్యాప్తంగా డీఎండీకే 8 శాతం ఓట్లు దక్కించుకుంది. 25 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు మార్జిన్ కంటే ఎక్కువ ఓట్లను డీఎండీకే అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
ఇదీ చదవండి:చిన్నమ్మ విడుదలతో తమిళ రాజకీయాల్లో మార్పులు?
తర్వాత విజయకాంత్ సహా ఆయన పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని 41 స్థానాల్లో పోటీ చేయగా.. 29 నియోజకవర్గాల్లో గెలుపొందింది. డీఎంకే కన్నా అధిక స్థానాలు గెలుచుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా సంపాదించింది. అనంతరం అప్పటి సీఎం జయలలితతో విబేధాల కారణంగా అన్నాడీఎంకేకు విజయకాంత్ దూరమయ్యారు. పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ప్రతిపక్ష స్థానాన్నీ కోల్పోయారు.