అక్రమాస్తులకు సంబంధించిన కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ఆయనపై చేపట్టిన దర్యాప్తుపై మధ్యంతర స్టే ఇస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ విచారణను జులై 14కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం పరిశీలించింది. డీకే శివకుమార్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. మే 23న దీనికి సంబంధించిన కేసు కర్ణాటక హైకోర్టు ధర్మాసనం ముందుకు రానుందని చెప్పారు. దీంతో సీబీఐ వేసిన పిటిషన్ విచారణను జులైకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న డీకే శివకుమార్‌పై దర్యాప్తును ఆధారంగా చేసుకొని.. ఆదాయపు పన్ను శాఖ కూడా ఆయన ఇంటిపై గతంలో దాడులు చేసింది. అదే సమయంలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సీబీఐ పలుమార్లు అనుమతి కోరింది. 2020లో డీకే శివకుమార్‌పై అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కేసు నమోదు చేసింది. తనపై జరుగుతోన్న దర్యాప్తును సవాలు చేస్తూ డీకే శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నందునే సీబీఐ తనకు వరుసగా నోటీసులు ఇస్తూ మానసికంగా ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. దీంతో ఆయనపై సీబీఐ చేస్తున్న దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 10వ తేదీన మధ్యంతర స్టే విధించింది. అనంతరం ఆ స్టేను పలుమార్లు పొడిగించింది. దీంతో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సీబీఐ సవాలు చేసింది.
'అదానీ వ్యవహారంపై సెబీకి గడువు'
Adani Sebi Supreme Court : అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణను పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు.. సెబీకి ఆగస్టు 14వరకు గడువు ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం అదానీ గ్రూప్ కేసు దర్యాప్తునకు సంబంధించి తాజా నివేదికను సమర్పించాలని సెబీని ఆదేశించింది.
ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక అనంతరం, సంస్థ షేర్ల విలువ భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో షేర్ల అవకతవకలపై రెండు నెలల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సెబీని సుప్రీం కోర్టు మార్చి 2న ఆదేశించింది. అయితే, ఈ విచారణకు ఆరు నెలల గడువు కావాలని కోరుతూ సుప్రీం కోర్టు వద్ద సెబీ దరఖాస్తు చేసుకుంది. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన న్యాయవాది విశాల్ తివారి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలు సేకరించేందుకు సెబీ కావాల్సినంత సమయం దొరికిందని ఆయన వాదించారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆగస్టు 14వరకు సెబీకి గడువు ఇచ్చింది.
మణిపుర్ హింసపై నివేదిక..
Manipur Violence Supreme Court Judgement : మణిపుర్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో బాధితుల కోసం తీసుకున్న భద్రతా చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింస, బాధితులకు సాయం, వారి భద్రత, పునరావాస చర్యలపై తాజా స్థితి నివేదికను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మణిపుర్ హైకోర్టు మెజారిటీ మైతీ రిజర్వేషన్లు కల్పించడం వల్ల తలెత్తిన చట్టపరమైన సమస్యలను పరిష్కరించబోమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి సంబంధించిన విషయమని ధర్మాసనం తెలిపింది.