DJ In Man Funeral Procession: సాధారణంగా ఎవరైనా మరణిస్తే వారి కుటుంబసభ్యులు అశ్రునయనాలతో అంతిమయాత్ర నిర్వహిస్తుంటారు. మృతదేహానికి సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరుపుతారు. కానీ మీరెప్పుడైనా డీజే పాటలు, డ్యాన్సుల మధ్య అంతిమయాత్ర నిర్వహించడం చూశారా? బంగాల్.. ఉత్తర 24 పరగణాలు జిల్లాలో ఓ 119 వృద్ధుడు మరణిస్తే ఆయన కుటుంబసభ్యులు అలానే చేశారు. డీజే పాటలకు బంధువులంతా డ్యాన్స్ చేస్తూ అంతిమయాత్ర నిర్వహించారు.
జిల్లాలోని కుమ్రా గ్రామానికి చెందిన డెబెన్ హజ్రా(119) అనారోగ్యంతో మరణించారు. ఆయన 1903లో జన్మించాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయనకు సంగీతమంటే చాలా ఇష్టం. చుట్టుపక్క గ్రామాల్లో ఎక్కడైనా నాటకాలు జరిగితే తప్పకుండా చూడటానికి వెళ్లేవారు. ఇంట్లో కూడా ఎక్కువ సమయం పాటలు పాడుతూ ఆనందంగా గడిపేవారు. శనివారం.. డెబెన్ మరణవార్త విన్న బంధువులంతా ఆయన ఇంటికి చేరుకున్నారు. అందరూ కలిపి డెబెన్ అంత్యక్రియల్లో డీజే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత అంతిమయాత్రలో గ్రామస్థులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డీజే పాటలకు అందరూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.