Diwali Precautions In Telugu 2023 :దీపావళి రోజున ఎటు చూసినా.. రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన భవనాలు, ఆ ఇళ్ల ముందు వెలిగించిన దీపాలుకనిపిస్తుంటాయి. ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండగ కోసం ప్రతిఒక్కరూ వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. పగటిపూట భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించటం.. మిఠాయిలతో నోరు తీపి చేసుకోవడం.. వంటి కార్యక్రమాలతో గడిచిపోతుంది. ఇక సాయంత్రం అయ్యిందంటే.. అసలు సందడి మొదలవుతుంది. టపాసుల మోతలతో ఊరూవాడా దద్దరిల్లిపోతాయి. ఈ సంబరాల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొంటారు. అయితే.. ఈ సమయంలో తప్పక కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆ గ్రామాల్లో దీపావళి రోజు నో సెలబ్రేషన్స్- విదేశాల్లో ఉన్న వారు కూడా! 200 ఏళ్లుగా
బాణసంచా కాల్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- కొవిడ్ తరువాత ప్రతి ఒక్కరి ఇంట్లో సానిటైజర్‌లు ఉంటున్నాయి. అయితే.. టపాసులను కాల్చే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులకు సానిటైజర్‌ను రాసుకోకూడదు. ఇందులో ఉండే ఆల్కాహాల్ చేతులకు మంటను అంటుకునేలా చేస్తుంది.
- టాపాసుల కార్యక్రమానికి సిద్ధం కావడానికి ముందుగానే.. ఒక బకెట్ నీళ్లను సిద్ధం చేసుకోవాలి. అనుకోకుండా మంటలు వ్యాపించినప్పుడు వాటిని ఆర్పేందుకు నీళ్లు అందుబాటులో ఉంటాయి.
- ఇంటి ముందు టాపాసులను కాల్చే సమయంలో పిల్లలను ఓ కంట కనిపెడుతుండాలి. పెద్దల సమక్షంలోనే పిల్లలు బాణసంచాను కాల్చేలా చూడాలి.
- టాపాసులను కాల్చే వారు కాటన్ దుస్తులను ధరించడం మేలు. చుడీదార్లను ధరించేవారు వదులుగా ఉన్నవి కాకుండా బిగుతుగా ఉండేవి వేసుకోవాలి.
- రాకెట్ బాంబులు, తారాజువ్వలను కాల్చే సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను పూర్తిగా మూసివేయండి. ఇవి కిటికీల్లో నుంచి లోపలికి వచ్చే ప్రమాదం ఉంటుంది.
- ఇంటి లోపల, వరండాలో బాంబులను పేల్చవద్దు. వాటి నుంచి వెలువడే శబ్దం, పొగతో వినికిడి, శ్వాసకోస సమస్యలు వస్తాయి.
- టాపాసులను చేతులతో పట్టుకొని కాల్చొద్దు. ఇంకా.. కొన్ని పేలకుండా కాసేపు అలా ఉండిపోతాయి. పేలలేదని దగ్గరకు వెళ్లి చూడవద్దు. అవి అనూహ్యంగా పేలితే గాయాలయ్యే అవకాశం ఉంటుంది.
- వస్త్ర దుకాణాలు, వ్యాపారులు, కార్యాలయాల్లో పూజలు చేసే వారు లక్ష్మీదేవి, కుబేర పూజలు చేయడం ఆనవాయితీ. పూజలో వెలిగించే దీపాలను తక్కువ నూనెతో నింపాలి. జ్యోతులు వెలుగుతున్న సమయంలో అక్కడే ఉండాలి.
- పర్యావరణానికి హాని చేయని గ్రీన్ క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఉపయోగించడం ఉత్తమం.
- బాణసంచాను కాల్చే సమయంలో చెప్పులను వేసుకోవాలి. మద్యం సేవించి టాపాసులను కాల్చవద్దు. ఎందుకంటే మద్యం మత్తులో మెదడు సరైన నిర్ణయాలను తీసుకోదు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
- చర్మంపై నిప్పురవ్వలు పడినా, కాలిన గాయాలైనా వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. కాలిన గాయాలపై నీళ్లను వేయకండి. సొంత వైద్యం మంచిది కాదని గుర్తుంచుకోండి.
- గాలి బాగా వీచే సమయంలో టాపాసులను కాల్చడం మంచిది కాదు. గాలికి నిప్పురవ్వలు సమీపంలోని గుడిసెలు, గడ్డి వాములు, ఇళ్లపై పడి అగ్నిప్రమాదాలు జరుగుతాయి.
దీపావళి గిఫ్ట్ - ఇలా ప్లాన్ చేస్తే అదుర్స్!
ధనత్రయోదశి నాడు ఈ 5 వస్తువులు తప్పక కొనుగోలు చేయాలి - ఎందుకో తెలుసా?