Divyang Navratri Mahotsav 2023 :గుజరాత్లో ఒకే వేదికపై వందల మంది దివ్యాంగులు ఆనందంగా 'గర్బా' నృత్యాలు చేశారు. దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు విపుల్భాయ్ అనే వ్యక్తి. ఈ గర్బా కార్యక్రమంలో సుమారు 700 మంది దివ్యాంగులు పాల్గొని సందడి చేశారు. చక్రాల కుర్చీలలో కూర్చొని గర్బా ఆడారు.
అయితే, దివ్యాంగుల కోసం ఈ కార్యక్రమాన్ని గొప్ప మనసుతో ప్రారంభించారు విపుల్ భాయ్. అహ్మదాబాద్‌కు చెందిన ఆయన ఓసారి మిత్రులతో కలిసి మైదానంలోగర్బానృత్యం చేద్దామని వెళ్లారు. అందరూ డ్యాన్స్ చేస్తున్న సమయంలో.. అక్కడ ఓ చోట కూర్చున్న దివ్యాంగుడిని చూసి చలించిపోయారాయన. దివ్యాంగుల కోసం ఏదైనా చేయాలని ఆరోజే నిర్ణయించుకున్నారు విపుల్. వారి కళ్లల్లో ఆనందాన్ని చూడాలని అనుకున్న ఆయన వారికోసం ప్రత్యేకంగా గర్బా ఏర్పాటు చేశారు. గత ఆరేళ్లుగా విపుల్ భాయ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 700 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. వారంతా ఉత్సాహాంగా గర్బా నృత్యాలు చేశారు.
Divyang Navratri Mahotsav in Ahmedabad :నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన దివ్యాంగ్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి.. విపుల్ భాయ్ తీసుకున్న చొరవ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం వల్ల తమ పరిచయాలు పెరిగాయని అన్నారు. "విపుల్ భాయ్ నిర్వహిస్తున్న దివ్యాంగ్ గర్బా మహోత్సవ్‌కు గత 6 ఏళ్లుగా వస్తున్నాను. ఇక్కడకు వచ్చి పండగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాను. చాలా మందితో కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడ్డాయి. దివ్యాంగులమైన మేము గర్బా ఆడలేమని అందరూ అనుకుంటారు. అయితే దీని నిర్వాహకుడు విపుల్ భాయ్ మాత్రం అలా ఆలోచించలేదు. మేము కూడా వారిలో ఒకరం అనుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు" అని తెలిపారు.