పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ సుప్రీంకోర్టు(Supreme Court) అసహనం వ్యక్తం చేసింది.
సస్పెండైన ఐపీఎస్ అధికారి గుర్జిందర్ పాల్ సింగ్‌పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం(Chhattisgarh government) దేశద్రోహం, తదితర కేసులు నమోదు చేసింది. ఈ కేసులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(Chief Justice N V Ramana) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసుల నమోదులో పోలీసు శాఖ బాధ్యత వహించాలని.. వారి తీరు ఇబ్బందికర సంప్రదాయంగా మారిందని ఆక్షేపించింది.
"పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాయడం కలవరపెట్టే ధోరణి. ఇలాంటి సంప్రదాయానికి తెరపడాల్సిన అవసరం ఉంది. పలు రాష్ట్రాల్లో రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదవుతున్నాయి. అధికారం మారగానే కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల ప్రాప్తం కోసం దేనికైనా సిద్ధపడుతున్నారు. కొందరు పోలీసు అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల రాజకీయ ప్రత్యర్థులను పోలీసులు వేధిస్తున్నారు."
-సుప్రీంకోర్టు.