కవిత... తమిళనాడు విరుధునగర జిల్లా రాజపాలయంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉప్యాధ్యాయురాలు. భర్త, కుమారుడితో ఎంతో సరదాగా సాగే ఈమె జీవితాన్ని.. రెండేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదం విషాదంలోకి నెట్టేసింది. నాటి దుర్ఘటనలో భర్తను పోగొట్టుకుంది కవిత. భర్త లేడన్న విషాదాన్ని దిగమింగుకునే.. తనకు వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అన్ని కష్టాలు పడుతూ కూడా మానవత్వంతో కరోనా రోగులకు సాయం చేయడానికి ముందుకొచ్చింది.
కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఉపాధ్యాయులు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అలాంటి సమయంలోనూ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కరోనా ఉపశమన నిధికి తన నగలను విరాళంగా ఇవ్వడానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లింది. అయితే కవిత కుటుంబ నేపథ్యం గురించి, డబ్బుకు బదులు బంగారాన్నే ఎందుకు విరాళంగా ఇస్తున్నారని ఆ జిల్లా కలెక్టర్ మేఘనాథ్ రెడ్డి ఆరా తీశారు.