పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్వరూప స్వభావాలను కాపాడుకోవడానికి ప్రజలే ముందుకు రావాలని ఉప రాష్ట్రపతి(Vice President of India) ఎం.వెంకయ్య నాయుడు(M.Venkaiah Naidu) పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న 5వేల మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రవర్తనను ప్రభావితం చేసేలా 'మిషన్ 5,000' పేరుతో ఉద్యమం చేపట్టాలన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలి వర్ధంతి(Death Anniversary Of Pranab Mukharjee) సందర్భంగా 'రాజ్యాంగవాదం- ప్రజాస్వామ్యానికి భరోసా, సమ్మిళిత వృద్ధి' అన్న అంశంపై ప్రణబ్ ముఖర్జీ లెగసీ ఫౌండేషన్ మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్మారకోపన్యాసం చేశారు.
"ప్రణబ్ ముఖర్జీ.. యూడీసీ నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఆయన్ను చూసి దేశం గర్విస్తుంది. చట్టసభలకు ఎన్నికయ్యే 5వేల మంది ప్రజాప్రతినిధుల ప్రవర్తన మారాలి. చట్టసభల్లో వారి వ్యవహారశైలి గురించి నియోజకవర్గాలకు వచ్చినప్పుడు ప్రజలు వారిని ప్రశ్నించాలి. సామాజిక మాధ్యమాల ద్వారా 'మిషన్ 5,000' పేరుతో సభలను అడ్డుకొనేవారి పేర్లు పోస్టుచేయాలి. చట్టసభ సభ్యుల పనితీరుపై చర్చించాలి. మళ్లీ ఓటేసేటప్పుడు వారి పనితీరును పరిగణనలోకి తీసుకోవాలి. దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించుకుంటున్న తరుణంలో ఈ ఏడాది సభాకార్యకలాపాలకు ఆటంకం సృష్టించకూడదని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతిన పూనాలి. ఒకసారి ఇలాచేస్తే అదే అలవాటుగా మారుతుంది"
-వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి