St. Aloysius Museum: కర్ణాటక మంగళూరులోని సెయింట్ అలోసియస్ కళాశాల.. అనేక పురాతన వస్తువులను సేకరించి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు వివిధ దేశాలకు చెందిన పురాతన, అరుదైన నాణేలను సేకరిస్తోంది. అంతేగాక.. ప్రతి నాణేనికి సంబంధించిన విశేషాలను ప్రదర్శిస్తూ విద్యార్థులను, చరిత్రకారులను ఆకర్షిస్తోంది. ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన నాణేలు బంగారంతో పాటు.. వివిధ లోహాలతో తయారైనవి. ఇవి వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను తెలియజేస్తాయని నిర్వాహకులు తెలిపారు.
వివిధ దేశాల నుంచి సేకరణ..
Display of Coins from 82 Countries: ఈ మ్యూజియంలో ఐదు వేర్వేరు విభాగాలకు చెందిన 4000 నాణేలను ప్రదర్శనకు ఉంచారు. వీటిని ప్రపంచంలోని 82 దేశాల నుంచి సేకరించారు. ఇందులో ఆసియాలోని 35 దేశాలకు చెందిన 318 నాణేలు, ఆఫ్రికాలోని 7 దేశాలకు చెందిన 71 నాణేలు, ఐరోపాలోని 27 దేశాలకు చెందిన 575 నాణేలతో పాటు.. ఇతర ప్రాంతాలకు చెందిన వందలకొద్దీ నాణేలు గమనించవచ్చు.
ఈ నాణేలతో చరిత్ర, నాటి ఆర్థిక వ్యవస్థల స్వరూపానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వివిధ కళాశాలల నుంచి చరిత్రకారులు, విద్యార్థులు అలోసియస్ మ్యూజియానికి తరలివస్తున్నారు.
"ఇక్కడ 2000 ఏళ్లనాటి నాణేలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 85కి చెందిన నాణెం, రోమన్ కాలం నాటి నాణెం, క్రీ.శ. 14 నుంచి క్రీ.శ. 325 వరకు నాణేలు ఉన్నాయి. భారత్‌కు చెందిన పాత బంగారు, మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలానికి చెందిన నాణేలున్నాయి."
--- కవితారావు, అలోసియస్ మ్యూజియం నిర్వాహకులు