టూల్‌కిట్ వ్యవహారంలో పర్యావరణ కార్యకర్త దిశా రవిని అరెస్టు చేయడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను భాజపా ప్రతినిధి సంబిత్ పాత్ర ఖండించారు. ప్రధాని మోదీపై విమర్శలు చేసేందుకు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ దేశ వ్యతిరేక శక్తులతోనే జట్టుకడతాయని మండిపడ్డారు. భారత్‌ను విభజించాలని చూస్తున్న వారి కుట్రలను దిల్లీ పోలీసులు బయటపెట్టారని చెప్పుకొచ్చారు.
"విపక్షాల విషయానికి వస్తే, ముఖ్యంగా కాంగ్రెస్.. మోదీని విమర్శించే ప్రతిసారి భారత వ్యతిరేక శక్తులకు మద్దతుగానే నిలబడ్డారు. భారత రత్నలైన సచిన్ తెందుల్కర్, లతా మంగేష్కర్ వంటి వారిపై దర్యాప్తు చేయవచ్చు.. కానీ, దేశాన్ని విభజించే శక్తులకు భావ ప్రకటన హక్కు కింద రక్షణ లభించాలి. ఇదే వారి విధానం. రిపబ్లిక్ డే హింసకు కారకులను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీనే.. డిమాండ్ చేసింది. ఇప్పుడు వారిని అరెస్టు చేస్తే ఆ పార్టీనే కన్నీరు కారుస్తోంది."