వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని భారత్ పేర్కొంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయితే తూర్పు లద్ధాఖ్లోని మిగతా ప్రాంతాల్లోనూ బలగాల ఉపసంహరణ సాధ్యమవుతుందని చెప్పింది. తద్వారా సరిహద్దులో శాంతి పునురుద్ధరణ సాధ్యమవుతుందని తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి.. ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద చైనా బలగాలను పెంచటం, మౌలిక వసతులను నిర్మాణానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ మేరకు సమాధానమిచ్చారు.
"బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఎల్ఏసీ వద్ద యథాతథ స్థితిని కొనసాగిస్తామని భారత్, చైనా అంగీకరించాయి. ఈ అవగాహనలను ఉల్లంఘిస్తూ ఇరు పక్షాలు ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదని మేం భావిస్తున్నాం. బలగాల ఉపసంహరణ ఎంత త్వరగా పూర్తయితే... తూర్పు లద్ధాఖ్లోని మిగతా ప్రాంతాల్లోనూ అంత త్వరగా బలగాలను ఉపసంహరించేందుకు వీలవుతుంది."
- అరిందమ్ బాగ్చి, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి