తెలంగాణ

telangana

చైనా సైన్యం వెళ్లాకే.. భారత బలగాలు వెనక్కి!

By

Published : Feb 11, 2021, 8:08 PM IST

Updated : Feb 11, 2021, 8:47 PM IST

భారత్‌-చైనా మధ్య తొలిదశ సైనిక బలగాల ఉపసంహరణ.. ఈ నెలాఖరుకల్లా పూర్తికానుంది. ఈ ప్రక్రియ పూర్తయిన 48 గంటల్లో.. ఇరుదేశాల మధ్య కమాండర్ల స్థాయి చర్చలు మొదలు కానున్నాయి. ఇతర ఉద్రిక్త ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై ఈ భేటీలో దృష్టి సారించనున్నారు. అయితే.. ఆయా ప్రాంతాల్లో చైనా బలగాలు పూర్తిగా వైదొలగినట్లు నిర్ధరించుకున్నాకే.. భారత్ ‌తన బలగాలను వెనక్కి తీసుకోనుంది.

Disengagement pact mandates China
చైనా పూర్తిగా వైదొలిగాకే.. భారత్​ కదలిక!

భారత్-‌చైనాల మధ్య దాదాపు 10 నెలలుగా ఉద్రిక్తతలకు కారణమైన తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు ప్రాంతాల్లో సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని సైనికవర్గాలు తెలిపాయి. అయితే.. దక్షిణ తీరంలోని వ్యూహాత్మక ప్రాంతాల నుంచి భారత బలగాలు చివరగా వైదొలగుతాయని పేర్కొన్నాయి. ఈ మేరకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు సీనియర్ ‌సైనికాధికారి తెలిపారు. ప్రతిదశలోనూ పరస్పరం ధ్రువీకరించుకుంటాయన్నారు.

సరిహద్దులో బలగాల ఉపసంహరణ

సంతృప్తి చెందాకే..

పాంగాంగ్‌సరస్సులోని ఇతర ప్రాంతాల్లో.. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్​ఏ) బలగాల ఉపసంహరణపై సంతృప్తి చెందిన తర్వాతనే కైలాష్ ‌పర్వత శ్రేణుల నుంచి భారత సైన్యం తిరిగి వస్తుందని సదరు అధికారి తెలిపారు. వాస్తవాధీన రేఖతో పాటు లోతైన ప్రాంతాల వెంట చైనా భారీగా సైనిక బలగాలతోపాటు ఆయుధాలను మోహరించటం వల్ల ఇరుదేశ సైన్యాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. తమ ప్రాదేశిక ప్రాంతాలను కాపాడుకునేందుకు డ్రాగన్‌కు దీటుగా భారత్‌కూడా ఆయా ప్రాంతాల్లో పెద్దఎత్తున సైన్యాన్ని మోహరించింది.

48 గంటల్లో..

పాంగాంగ్ ‌సరస్సు దక్షిణ తీరం నుంచి ఇరు దేశాల యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాల ఉపసంహరణ గురువారం సాయంత్రం పూర్తయినట్లు సైనికవర్గాలు తెలిపాయి. ఇరువైపులా వందకుపైగా యుద్ధ ట్యాంకులు ఉన్నట్లు పేర్కొన్నాయి. సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయిన 48 గంటల్లో భారత్‌-చైనాల మధ్య కమాండర్‌స్థాయి చర్చలు మొదలవుతాయని సైనికవర్గాలు పేర్కొన్నాయి. దేప్‌సంగ్‌, గోగ్రా హాట్‌స్ప్రింగ్‌, దేమ్‌చోక్‌లో సైనిక బలగాల ఉపసంహరణపై ఆ భేటీలో చర్చించనున్నట్లు తెలిపాయి.

ఇదే తొలి అంకం..

పాంగాంగ్ ‌సరస్సు నుంచి డ్రాగన్‌ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవటం సానుకూల విషయమని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు ప్రకటించాయి. ఉత్తర ప్రాంతంలోని ఫింగర్‌8 వద్దకు వెళ్లేందుకు చైనా అంగీకరించినట్లు తెలిపాయి. అక్కడి నుంచి ప్రణాళిక ప్రకారం సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. దక్షిణ ప్రాంతం నుంచి డ్రాగన్‌ తన యుద్ధ ట్యాంకులను వేగంగా తరలించిందని, మిగతా ప్రాంతాల్లో ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. పాంగాంగ్​ సరస్సు ప్రాంతాల్లో సైనిక బలగాల ఉపసంహరణ.. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణలు నెలకొన్న కీలక ప్రాంతాల్లో ఉద్రిక్తతల నివారణ చర్యల్లో తొలి అంకంగా భావిస్తున్నారు.

ఓ నిర్ణయానికి వచ్చే వరకూ..

భారత్‌-చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. పాంగాంగ్ ‌సరస్సు ఉత్తర తీరంలోని 8వ ఫింగర్ ‌పాయింట్ వద్దకు డ్రాగన్‌ బలగాలు మళ్లుతాయి. ఫింగర్‌3 వద్ద శాశ్వత ప్రాంతమైన ధన్‌సింగ్ ‌తాపా పోస్టు వద్దకు భారత బలగాలు చేరుకుంటాయి. ఒప్పందం ప్రకారం ఫింగర్‌3, ఫింగర్‌8 ప్రాంతాలు పెట్రోలింగ్‌ రహిత జోన్లుగా మారనున్నాయి. మళ్లీ ఇరు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చే వరకూ ఆయా ప్రాంతాల్లో ఎలాంటి సైనిక కార్యకలాపాలు సాగవన్నమాట.

ఫింగర్‌4, ఫింగర్‌8 మధ్య చైనా సైన్యం.. అనేక బంకర్లతోపాటు పలు నిర్మాణాలు చేపట్టింది. తమ పెట్రోలింగ్ ‌బృందాలు ఫింగర్‌4ను దాటి వెళ్లకుండా డ్రాగన్ ‌అడ్డుకోగా.. భారత సైన్యం తీవ్రంగా ప్రతిస్పందించింది. 9 విడతలుగా జరిగిన సైనిక కమాండర్ల చర్చల్లో భారత్ ‌ప్రధానంగా.. పాంగాంగ్ ‌సరస్సు ఉత్తర ప్రాంతంలోని ఫింగర్‌4, ఫింగర్‌8 మధ్య చైనా తన బలగాలను ఉపసంహరించుకోవాలని తేల్చిచెప్పింది.

ఇదీ చదవండి:'యథాతథ స్థితి లేదంటే.. శాంతి లేనట్లే'

Last Updated : Feb 11, 2021, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details