Congress Rajyasabha Candidates: రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. 10 మందితో కూడిన జాబితాను ఆదివారం విడుదల చేసింది. పి.చిదంబరం, జైరాం రమేశ్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ వంటి సీనియర్ నేతలకు అవకాశం కల్పించింది. అయితే తమకూ అవకాశం దక్కుతుందని ఆశించి భంగపాటుకు గురైన మరికొంత మంది సీనియర్ నేతలు అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి వెళ్లగక్కారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ నిరసన గళాన్ని ఎత్తారు.
Rajyasabha Elections: రాజస్థాన్ నుంచి రణ్‌దీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీకి కాంగ్రెస్ అవకాశమొచ్చింది. అయితే సొంత రాష్ట్రానికి చెందిన నాయకులు చాలా మంది ఉండగా.. బయటవారికి అవకాశం ఎలా ఇచ్చారని అదే రాష్ట్రానికి చెందిన సిరోహి కాంగ్రెస్ ఎమ్మెల్యే సన్యం లోధా ప్రశ్నించారు. రాజస్థాన్ నుంచి తనకు కచ్చితంగా అవకాశం వస్తుందని ఆశించిన పవన్ ఖేరా.. తన అసంతృప్తిని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు. తన తపస్సు కొద్ది దూరంలో ఆగిపోయిందేమో అని ఆదివారం సాయంత్రం వ్యాఖ్యానించారు. అయితే ఆ మరునాడే ఉదయమే ఆయన శాంతించినట్లు కన్పించింది. కాంగ్రెస్ నేతలందరికీ పార్టీ వల్లే గుర్తింపు వచ్చిందని, ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దని మరో ట్వీట్ చేశారు. ఇది తన అభిప్రాయమని, అందుకు కట్టుబడి ఉంటానని కొద్ది రోజుల క్రితం తను చెప్పిన మాటలనే గుర్తు చేశారు. రాజ్యసభకు పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.