ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం), వీవీపాట్‌లో పొందుపరిచిన ఫర్మ్‌వేర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీక్షిస్తున్న సమయంలో ఆయా యంత్రాల్లో లోపాలు బయటపడి ఉంటే వాటి వివరాలను వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. ప్రామాణీకరణ, పరీక్షలు, నాణ్యత ధ్రువీకరణ (స్టాండర్డైజేషన్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్-ఎన్‌టీక్యూసీ) డైరెక్టరేట్ ఈ ఫర్మ్‌వేర్‌ను మదింపు చేస్తుంది. ఈ సందర్భంగా లోపాలు బయటపడిన ఈవీఎం, వీవీపాట్‌ల వివరాలను దరఖాస్తుదారుకు ఇవ్వాలని ఆదేశించింది.
ప్రభుత్వరంగ సంస్థలైన ఈసీఐఎల్, బీఈఎల్‌లు రూపొందించిన ఎం3 తరం ఈవీఎంలు, ఎం2 తరం వీవీపాట్‌లను 2019 ఎన్ని కల్లో ఉపయోగించారు. తనిఖీలు జరిపినప్పుడు వీటిలో ఎన్నింటిలో లోపాలు కనిపించాయో వివరాలు ఇవ్వాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల పరిధిలోని ఎస్‌టీక్యూసీని వెంకటేశ్ నాయక్ అనే సమాచార హక్కు కార్యకర్త కోరారు. ఎన్ని యంత్రాల్లోని ఫర్మ్‌వేర్‌ను పరిశీలించారు? వాటిలో ఎన్నింటిలో లోపాలు కనిపించాయి? ఇతరత్రా లోపాలు ఉన్న యంత్రాలు ఎన్ని ఉన్నాయి? ఏయే రోజుల్లో, ఏయే ప్రదేశాల్లో తనీఖీలు చేశారు? వాటిని చేపట్టిన అధికారుల పేర్లు ఏమిటి? అన్న వివరాలు ఇవ్వాలని దరఖాస్తులో కోరారు.