కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగుచట్టాల అమలుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది. చట్టాల విషయంలో రైతులు, కేంద్రం మధ్య తలెత్తిన సమస్య పరిష్కారానికి భారత కిసాన్ సంఘం అధ్యక్షుడు భూపీందర్ సింగ్ మాన్, షెట్కారీ సంఘటన్ అధ్యక్షుడు అనిల్ ఘన్వాట్, దక్షిణాసియా ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటిలతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో చట్టాల అమలుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రైతు సంఘాలతో సహా పలు పార్టీలు స్వాగతించాయి.
అయితే కమిటీలోని సభ్యుల ఎంపిక పట్ల కొన్నిరైతుసంఘాలు, రాజకీయ పక్షాలు పెదవి విరుస్తున్నాయి. సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన రైతుసంఘాల నేతలు.. సాగుచట్టాలను పూర్తిగా రద్దుచేసేంత వరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన సంయుక్త కిసాన్ మోర్చా.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ముందు హాజరుకాబోమని తేల్చిచెప్పింది. కమిటీలపై తమకు నమ్మకం లేదని అఖిల భారత కిసాన్ సభ నేతలు తెలిపారు. కమిటీ సభ్యుల ఎంపికపై పెదవి విరిచిన అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి.. సభ్యుల ఎంపికలో కోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపించింది.
కమిటీలోని నలుగురు సభ్యులు గతంలో సాగుచట్టాలకు అనుకూలంగా మాట్లాడినవారేనన్న కాంగ్రెస్.. ఆందోళన చేస్తున్న రైతులకు వారు ఏవిధంగా న్యాయం చేయగలరని ప్రశ్నించింది. వారి వైఖరి, గతం పరిశీలించకుండా సీజేఐకి వీరి పేర్లు ఎవరు ఇచ్చారో తెలియడం లేదని పేర్కొంది. రైతు వ్యతిరేక చట్టాలకు లిఖిత పూర్వకంగా మద్దతుతెలిపిన వ్యక్తుల నుంచి న్యాయాన్ని ఏవిధంగా ఆశించగలమన్న రాహుల్ గాంధీ.. సాగు చట్టాలను రద్దుచేసేంత వరకూ పోరాటం సాగుతుందని ట్వీట్ చేశారు.