కలెక్టర్ ఆఫీసులో సమస్యలను తీర్చండని అభ్యర్థనలు చేయడం చూస్తుంటాం. లిఖిత రూపంలో ఫిర్యాదు చేయడం సాధారణమే. అయితే ఒడిశా.. అనుగుల్ జిల్లా కలెక్టరేట్లో మాత్రం సోమవారం ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఓ దివ్యాంగుడు తాను పెళ్లి చేసుకునేందుకు ఓ యువతిని వెతికిపెట్టాలని కలెక్టర్ వద్ద అభ్యర్థించాడు. ఈ అభ్యర్థనతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
అనుగుల్ జిల్లా కలెక్టర్ ఆఫీసుకు సోమవారం నువాపాడ గ్రామానికి చెందిన సంజీబ్ మహాపాత్ర అనే ఓ దివ్యాంగుడు వెళ్లాడు. తాను పెళ్లి చేసుకునేందుకు ఓ యువతిని వెతికిపెట్టాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న తనను జిల్లా యంత్రాంగం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. 'ప్రభుత్వం నేను పెళ్లి చేసుకునేందుకు ఓ యువతిని వెతికిపెట్టాలి. నేను, నా కుటుంబం ఎంత ప్రయత్నించినా నాకు పెళ్లి కుదరలేదు. నేను దివ్యాంగుడిని. నా తల్లిదండ్రులు వృద్ధులయ్యారు. నా సోదరుడు వేరే కాపురం ఉంటున్నాడు. నేను సరిగ్గా నడవలేను. నా తల్లిదండ్రులు, నన్ను చూసుకోవడం కోసం ఓ తోడు అవసరం. అందుకే వివాహం చేసుకుందామనుకుంటున్నా. అలాగే ట్రైసైకిల్‌ను నాకు ప్రభుత్వం ఇప్పించాలి' అని సంజీబ్ మహాపాత్ర కోరాడు.