Disabled Boy Plays Football With Single Leg Khammam :ఏమైనా కోల్పోవచ్చుగానీ.. ఆత్మ విశ్వాసం మాత్రం కోల్పోకూడదు అంటారు పెద్దలు. అదొక్కటి ఉంటే చాలు.. కోల్పోయిన వాటన్నింటిని తిరిగి దక్కించుకోవచ్చు. ఆత్మస్థైర్యంతో వైకల్యాన్ని అధిగమించి.. తన ఆకాంక్షకు అనుగుణంగా అడుగులు వేస్తూ పట్టుదలతో శ్రమిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ బుడతడు. ఒంటి కాలుపై తన పనిని తాను చేసుకుంటూ.. ఇష్టమైన ఆటల్లో రాణిస్తున్నాడు. ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్నెస్పీ ప్రాంతానికి చెందిన శివకుమార్ అనే బాలుడు.
Khammam Boy Plays Football With Single Leg Khammam :ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్నెస్పీలో నివాసముంటున్న మల్లి రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్నకుమారుడు శివకుమార్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. గత ఏడాది నవంబర్‌లో ప్రమాదవశాత్తు బాలుడిని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో శివకుమార్ కాలుకు తీవ్ర గాయం కావడంతో శస్త్ర చికిత్స చేసి తొడ వరకు తొలగించారు. దీంతో చిన్న వయసులోనే ఒక కాలు కోల్పోవడంతో అంగవైకల్యం ఏర్పడినా.. ఆత్మధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు. ఒక కాలుతోనే తనకి ఇష్టమైన ఆటలు ఆడటమే కాకుండా ఆసనాలు చేస్తూ పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
"నిద్రలేచిన దగ్గర నుంచి ఇంటి వద్దనే బాగా ఆడుకుంటాడు. పుట్‌బాల్ వంటి ఆటలు ఎక్కువగా ఆడతాడు. కాలు లేదనే మాట తప్ప చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అసలు తన గురించి పట్టించుకోనవసరం లేదు. తోటి పిల్లలతో ఆడుకుంటాడు. ఇటు ఆటలు, అటు చదువులోనూ ఫస్ట్ ఉంటాడు."- నాగలక్ష్మీ, తల్లి
Boy Talent in Khammam : విద్యార్థి శివకుమార్‌కు చిన్న వయసులోనే అంగవైకల్యం సంభవించడంతో కల్లూరు స్థానిక పాఠశాల ప్రధానోపధ్యాయురాలు కొల్లిపర శ్రీలక్ష్మి తన ఉదారతను చాటుకున్నారు. చురుగ్గా ఉత్సాహంగా ఉండే శివకుమార్ నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో ఆ బాలుడికి అన్ని రకాలుగా సాయం అందిస్తున్నారు. తన తోటి ఉపాధ్యాయులకు విద్యార్థి కుటుంబ పరిస్థితిని చెప్పడంతో వారు స్పందించి రూ.1.2 లక్షలు సాయం చేశారు. ఆ మొత్తాన్ని విద్యార్థి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. ప్రమాదంలో కాలు పోవడం చాలా బాధకరమైన విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆటలే కాదు చదువులోనూ చాలా చురుగ్గా ఉంటాడని, శివకుమార్‌కు కృత్రిమ కాలు పెట్టిస్తే..ఇంకా రాణిస్తాడని ఆశిస్తున్నారు.