మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కొందరు 'చెత్త' రాజకీయాలకు పాల్పడుతున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. అయితే.. ఆ ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించబోవని ఆయన అన్నారు. ముకేశ్ అంబానీకి బాంబు బెదిరింపుల కేసులో ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న పోలీసు అధికారి సచిన్ వాజే.. దర్యాప్తు సంస్థకు రాసిన లేఖ కలకలం సృష్టించింది. ఈ లేఖపై స్పందించిన రౌత్.. భాజపాపై పరోక్ష ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి:'మహా సర్కార్‌ను ప్రశ్నించేందుకే.. ఆ కేసు ఎన్‌ఐఏకు'
"జైల్లో ఉన్న నిందితుల నుంచి లేఖలు రావడం ఇప్పడో కొత్త ట్రెండ్‌గా మారుతోంది. ఇలాంటి చెత్త రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదు. దర్యాప్తు సంస్థలు, రాజకీయ పార్టీల ఐటీ విభాగాలు, నిందితులు రాసినట్లుగా చెబుతున్న లేఖలతో వ్యక్తుల పరువు ప్రతిష్ఠలను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని బలహీనపర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇవి. ఇలాంటి కుట్రలు ఎన్నటికీ ఫలించవు" అని రౌత్ మీడియాతో అన్నారు. వాజే తన లేఖలో పేర్కొన్న అనిల్ పరబ్ తనకు బాగా తెలుసని, బాల్ ఠాక్రేపై ప్రమాణం చేసి ఆయన అబద్ధాలు చెప్పరని అన్నారు.