Direct To Mobile Technology In India : 'డైరెక్ట్ టు మొబైల్ (D2M)' బ్రాడ్కాస్టింగ్ సాంకేతికత వచ్చే ఏడాదికల్లా సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని భారత శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి అభయ్ కరాండికర్ తెలిపారు. ఇంటర్నెట్తో పాటు ఈ కొత్త సాంకేతికత కూడా వినియోగంలో ఉంటుందని వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ సాంకేతికతపై ల్యాబ్ ట్రయల్స్ జరగుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత నగరాల వారీగా ల్యాబ్ ట్రయల్స్ చేయాల్సి ఉందన్నారు. దీంతో ఈ సాంకేతికత సామర్థ్యాన్ని ప్రదర్శించవచ్చని తెలిపారు.
"వచ్చే ఏడాదికల్లా ఈ D2M సాంకేతికతను సాధారణ ప్రజల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యవస్థతో ప్రారంభిస్తాము. అయితే ఇది ఇంటర్నెట్కు పోటీ కాదు. ఉదాహరణకు మీరు ఇంటర్నెట్ ద్వారా ఓటీటీ వినియోగిస్తున్నారు. ఇక నుంచి D2M ద్వారా ఇంటర్నెట్ లేకుండానే ఓటీటీ ఉపయోగించుకోవచ్చు. ఈ D2M, ఇంటర్నెట్తో పాటు వాడకంలో ఉన్న వైఫై సాంకేతికతను పోలి ఉంటుంది. ఇది కూడా ఇంటర్నెట్తో పాటు మనుగడ సాగించగలదు."
-- అభయ్ కరాండికర్, భారత శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందో అభయ్ కరాండికర్ వివరించారు. 'గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది తక్కువ స్థాయి స్మార్ట్ఫోన్లు, 3జీ కనెక్షన్లు వినియోగిస్తున్నారు. వారు ఇంకా హై- స్పీడ్ డేటాకు మారలేదు. అయితే D2M టెక్నాలజీ ద్వారా, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే డేటాను వినియోగించుకోవచ్చు' అని తెలిపారు.