Congress President Election : నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియనున్నా ఇప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి పోటీ చేసేది ఎవరెవరనేది తేలడం లేదు. రాజస్థాన్‌లో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ బుధవారం రాత్రి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ ఆయనకు లభించలేదని పార్టీ వర్గాలు 'ఈటీవీ భారత్'కు తెలిపాయి. తన అభ్యర్థిత్వంపై స్పష్టత తీసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దిల్లీకి వచ్చేముందు రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రతోనూ ఆయన ఫోన్లో మాట్లాడడం విశేషం. ఇంతవరకు గహ్లోత్‌పై వేరే మచ్చ లేకపోయినా, ఎమ్మెల్యేల ధిక్కార స్వరం విషయం ఆయనకు తెలియకుండా జరిగిన పరిణామం కాదని అధిష్ఠానం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర మాజీ మంత్రి ఎ.కె.ఆంటోనీతో, మరికొందరు సీనియర్ నేతలతో సోనియా మాట్లాడారు.
పార్టీ నిర్ణయం శిరోధార్యం: ఖర్గే
30న నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తానని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఇదివరకే ప్రకటించారు. సోనియా అడిగినట్లయితే.. రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఈ పదవికి పోటీ చేస్తారని ఆయన సన్నిహిత నేతలు చెబుతున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఆయన ఇటీవల పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలిసి, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది తనకు శిరోధార్యమని చెప్పారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ బుధవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్ష పదవికి పోటీపై ఆసక్తి లేదని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ భోపాల్‌లో చెప్పారు.