Digital Personal Data Protection Bill 2023 : డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు-2023 ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంటు పరిశీలనకు వెళ్లనుంది. నిబంధనల్ని ఉల్లంఘించిన ప్రతిసారీ సంబంధిత సంస్థలు రూ.250 కోట్ల వరకు జరిమానా చెల్లించేలా ముసాయిదాలో పొందుపర్చారు.
Union Cabinet Meeting : కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన ముసాయిదాలోని దాదాపు అన్ని నిబంధల్ని ఈ బిల్లులో చేర్చారని అధికార వర్గాలు తెలిపాయి. ఏదైనా వివాదాలు తలెత్తితే దానిపై డేటా పరిరక్షణ మండలి నిర్ణయం తీసుకునేలా బిల్లులో నిబంధనలు పొందుపర్చారు. డేటా గోపత్యకు భంగం వాటిల్లితే పరిహారాన్ని కోరుతూ పౌరులు సివిల్ కోర్టుల్ని ఆశ్రయించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత గోప్యత హక్కు కింద పౌరుల డేటా సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ విషయంలో అంతర్జాల కంపెనీలు, మెుబైల్ యాప్‌లు, వ్యాపార సంస్థలు మరింత జవాబుదారీగా ఉండేలా చేయడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని వెల్లడించాయి.
కేంద్ర ప్రభుత్వం.. 2019 డిసెంబర్లోనే డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లును పార్లమెంట్ జాయింట్ కమిటీ పరిశీలనకు పంపింది. పార్లమెంట్ జాయింట్ కమిటీ పరిశీలన అనంతరం.. స్పీకర్‌కు నివేదిక సమర్పించింది. వివిధ ఏజెన్సీలు ఫీడ్‌బ్యాక్ దృష్ట్యా.. 2022 ఆగస్టులో కేంద్రం ఉపసంహరించుకుంది. మళ్లీ 2022 నవంబరు 18న ప్రభుత్వం డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు.. కొత్త ముసాయిదాను ప్రచురించింది.
గోప్యత హక్కు కూడా ప్రాథమిక హక్కేననిసుప్రీంకోర్టు స్పష్టంచేసిన తర్వాత ఈ బిల్లు ప్రక్రియ మొదలైంది. ప్రజల నుంచి సూచనలు ఆహ్వానించినప్పుడు 21,666 మంది స్పందించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం సహా వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపి ముసాయిదాకు తుది రూపునిచ్చారు.
Parliament Monsoon Session 2023 : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. కొంతకాలంగా ఉమ్మడి పౌర స్మృతి-యూసీసీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనికి తోడు యూసీసీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో జరుగుతున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూసీసీపై ముందడుగు వేసేలా కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.