Rahul Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రజల సమస్యలు వింటూ, తనతోపాటు యాత్రలో పాల్గొంటున్న వారిని ఉత్సాహపరుస్తూ.. రాహుల్ ముందుకు సాగుతున్నారు. కానీ, ఈ యాత్రలో కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లు అధికార భాజపాకు విమర్శనాస్త్రాలుగా మారుతున్నాయి. బుధవారం రాహుల్ గాంధీ సభలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకోగా.. ఆ వీడియో వైరల్‌గా మారింది.
రాహుల్ సభలో జాతీయగీతం బదులు మరో పాట.. కాంగ్రెస్‌పై భాజపా విమర్శలు - భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ జోడో యాత్ర సభలో ఇబ్బందికర పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియోను భాజపా నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారు.
మహారాష్ట్రలోని వసీమ్‌లో భారత్ జోడో యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో రాహుల్ ప్రసంగం ముగిసిన తర్వాత జాతీయగీతాలాపన చేయమంటారు. దీంతో సభావేదికపై ఉన్నవారితోపాటు, సభకు హాజరైన వారంతా లేచి నిల్చుంటారు. కానీ, జాతీయగీతం బదులు వేరే పాట వినిపించడంతో ఆశ్చర్యపోయిన రాహుల్ వేదికపై ఉన్న నేతలను ఇదేంటని ప్రశ్నిస్తారు. వెంటనే ఆ పాటను ఆపి, జాతీయగీతం ప్లే చేసినట్టు వీడియోలో రికార్డు అయింది. అయితే, ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
దీన్ని భాజపా నేతలు ట్విట్టర్లో షేర్ చేస్తూ "భారత్‌ను ఏకం చేసేవారి జాతీయగీతం" అంటూ విమర్శలు చేస్తున్నారు.ప్రస్తుతం భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోని అంకాలా జిల్లాలో కొనసాగుతోంది. నవంబరు 20న మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. ఇప్పటిదాకా రాహుల్ ఆరు రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో 1,608 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు.